భారతీయ జనతా పార్టీలో మరో క్రీడాకారిణి అడుగుపెట్టారు. ప్రముఖ రెజ్లర్ బబితా ఫొగట్‌తో పాటు ఆమె తండ్రి మహావీర్ ఫొగట్ భాజపాలో చేరారు. దిల్లీలోని హరియాణా భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో బబిత, మహావీర్ కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు.
"నేను ఇంతకుముందు ఏ పార్టీలోనూ లేను. మొదటిసారి రాజకీయాల్లోకి వస్తున్నా. భాజపాలోకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 370 ఆర్టికల్‌పై ఇంతవరకు ఎవరూ నిర్ణయం తీసుకోలేని సమయంలో మోదీ సాహసోపేతంగా వ్యవహరించారు."
- బబితా ఫొగట్, రెజ్లర్
బబిత హరియాణా పోలీసు విభాగంలో ఇన్‌స్పెక్టర్. ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ఫొగట్ కుటుంబం తెలిపింది.
కశ్మీరీ యువతులపై హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలను బబిత సమర్థించారు. ఆయన అన్నదాంట్లో ఎలాంటి వివాదం లేదని, వక్రీకరణలు వద్దని మీడియాకు సూచనలు చేశారు.
ఇదీ చూడండి: 'వరద ప్రభావం': దర్జాగా ఇల్లెక్కిన మొసలి!