ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన జరిగాక కశ్మీర్ లోయలో పర్యటించిన డోభాల్.. షోపియాన్ జిల్లాలోని రోడ్లపై సాధారణ జనంతో కలిసి భోజనం చేస్తూ కనిపించారు. ఆయన పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. 'డబ్బులిచ్చి ఎవరినైనా తెచ్చుకోవచ్చు' అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
క్షమాపణలకు డిమాండ్..
కాంగ్రెస్ నేత ఆజాద్‌పై ఎదురుదాడికి దిగింది భాజపా. డోభాల్ కశ్మీర్ పర్యటనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఆజాద్ వ్యాఖ్యలను తప్పుబట్టారు భాజపా అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్.
" ఆజాద్ వ్యాఖ్యలు దురదృష్టకరం. డబ్బులిచ్చి మనుషులను తెచ్చినట్లు కాంగ్రెస్ చెప్పాలనుకుంటోందా? ఇలాంటి వ్యాఖ్యలను పాకిస్థాన్ ప్రజల నుంచి మాత్రమే ఊహించవచ్చు. భారత్‌లో అతిపెద్ద రాజకీయ పార్టీ నుంచి కాదు. ఈ వ్యాఖ్యలను అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం."
- షానవాజ్ హుస్సేన్, భాజపా అధికార ప్రతినిధి
ఇదీ చూడండి: ఆర్టికల్ 370 రద్దుపై అత్యవసర విచారణకు నో