అయోధ్య రామజన్మ భూమి-బాబ్రీ మసీదు కేసు క్షక్షిదారులైన యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు సహా ముస్లిం పక్షాలు కేసుకు సంబంధించి లిఖితపూర్వక అభిప్రాయాన్ని సుప్రీంకోర్టుకు సమర్పించాయి. అయోధ్య కేసులో కోర్టు ఇవ్వబోయే తీర్పు... దేశ భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డాయి.
" అయోధ్య కేసులో కోర్టు ఇవ్వబోయే తీర్పు భవిష్యత్తు తరంపై ప్రభావం చూపుతుంది. దేశ భవిష్యత్తు రాజకీయలపైనా దాని పర్యవసానాలు ఉంటాయి. రాజ్యాంగ విలువలను విశ్వసించే లక్షల మంది ప్రజల మనస్సులపై దీని ప్రభావం ఉంటుంది. దేశంలోని వివిధ మతాలు, సంప్రదాయాల విలువలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందన్న నమ్మకం ఉంది. భవిష్యత్తు తరాలు ఈ తీర్పును ఎలా చూస్తాయో కూడా కోర్టు పరిగణించాలి."
- ముస్లిం పక్షాలు.
'సీల్డ్ కవర్'పై అభ్యంతరం
ముస్లిం పక్షాలు లిఖితపూర్వక వాదనల్ని సీల్డ్ కవర్లో సమర్పించడంపై ఇతర కక్షిదారులు, సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తంచేశాయి. ఈ అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది. ముస్లిం పక్షాల వాదనల్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పష్టంచేసింది.
తీర్పుపై ఉత్కంఠ
రాజకీయంగా సున్నితమైన అయోధ్య కేసుపై 40 రోజుల పాటు రోజువారీ విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈనెల 16న తీర్పును వాయిదా వేసింది. రామ్‌లల్లా, యూపీ సున్నీ వక్ఫ్ బోర్డ్లను మూడు రోజుల్లో లిఖిత పూర్వక అభిప్రాయాలను సమర్పించాలని ఆదేశించింది.
అయోధ్య కేసులో తీర్పు నవంబర్ 4-17 మధ్య వెలువడే అవకాశముంది.
ఇదీ చూడండి: ఓటేసేందుకు హరియాణా సీఎం 'ఆకర్ష' ప్రయాణం