మాజీ ఉప ప్రధాని, భాజపా సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ సహా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం చేసిన ఉద్యమంలో పాల్గొన్న నేతలకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానం పంపనునట్లు ఆలయ ట్రస్టు సభ్యులు ఒకరు చెప్పారు. ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.
భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కటియార్లను కూడా కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర టస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ చెప్పారు. ప్రస్తుతం ఈ నేతలందరూ బాబ్రీ మసీదు కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. అడ్వాణీ ఇతర నేతలతో కలిసి అప్పట్లో రామమందిర ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని గుర్తు చేశారు కామేశ్వర్ చౌపాల్.
ప్రస్తుత తరం భాజపా నేతలెవరూ రామ మందిర ఉద్యమంలో పాల్గొనలేదని తెలిపారు బాబ్రీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంతోష్ దుబే. అప్పట్లో ఉద్యమాన్ని నడిపిన నేతలెవరూ ఇప్పుడు క్రియాశీల రాజకీయాల్లో లేరని పేర్కొన్నారు.
భూమి పూజ కార్యక్రమంలో ఐదు వెండి ఇటుకలను గర్భగుడి లోపల ఉంచనున్నట్లు తెలిపారు రామమందిర ట్రస్టు అధికార ప్రతినిధి నృత్యగోపాల్ దాస్. హిందూ పురాణాల ప్రకారం ఈ ఇటుకలు ఐదు గ్రహాలకు ప్రతీక అని వివరించారు.
ఆలయ ట్రస్టు వర్గాల సమాాచారం ప్రకారం హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్లకు ఆహ్వానం పంపనున్నారు.