వివాదాస్పద అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీంకోర్టు 10వ రోజు విచారణ చేపట్టింది. పిటిషనర్ గోపాల్ సింగ్ విశారద్ తరపున న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎదుట రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు.
"పరాశరన్, వైద్యనాథన్ వాదనలను ఆధారంగా చేసుకుని మా వాదనలు వినిపిస్తున్నాను. నేను ఆరాధకుడిగా ఉన్నాను. ఆరాధన నాకున్న (భక్తులు) పౌరహక్కు. దానిని నియంత్రించకూడదు."- రంజిత్ కుమార్, పిటిషినర్ గోపాల్‌సింగ్ తరపు న్యాయవాది
'ఆలయం స్థానంలో మసీదు'
పిటిషనర్ రామ్‌లల్లా తరఫున న్యాయవాది వైద్యనాథన్ ఆగస్టు 8న వాదనలు వినిపించారు. అయోధ్యలో హిందూ ఆలయం స్థానంలో మసీదును నిర్మించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనానికి వైద్యనాథన్ నివేదించారు.
తన వాదనకు బలాన్ని చేకూర్చడానికి పురావస్తుశాఖ(ఏఎస్ఐ) నివేదికను ప్రస్తావించారు వైద్యనాథన్. వివాదాస్పద భూమి వద్ద మొసలి, తాబేలు చిత్రాలున్నాయని... వాటితో ముస్లిం సంప్రదాయానికి సంబంధం లేదని, అవి హిందూ దేవతల ప్రతిరూపాలని వివరించారు.
రోజువారీ విచారణ
అయోధ్య కేసు పరిష్కారంలో 'మధ్యవర్తిత్వం' విఫలమవడం వల్ల రోజువారీ విచారణ జరపడానికి అత్యున్నత న్యాయస్థానం ఇటీవలే నిర్ణయించింది.
ఇదీ చూడండి: మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ