అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసు నుంచి సున్నీ వక్ఫ్ బోర్డు వైదొలగనున్నట్లు వస్తున్న వార్తలపై.. ముస్లిం పక్షాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
సుప్రీంకోర్టు నియమించిన మధ్యవర్తిత్వ కమిటీలో కుదిరిన ఒప్పందాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు తప్ప తామంతా వ్యతిరేకిస్తున్నట్లు ముస్లిం పక్షాల న్యాయవాది ఈజాజ్ మక్బూల్ తెలిపారు. మధ్యవర్తిత్వ ప్రక్రియలో ముఖ్యమైన హిందూ వర్గాలు లేనందున దీన్ని తాము తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కలీఫుల్లా నేతృత్వంలో ఏర్పాటైన మధ్యవర్తిత్వ కమిటీ.. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రతిపాదించింది. ఇందులో భాగంగానే రాజీ ప్రక్రియ కింద సున్నీ వక్ఫ్ బోర్డు కేసును ఉపసంహరించుకోనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ముస్లిం పక్షాలు ఈ ప్రకటన విడుదల చేశాయి.
సుమారు 40 రోజుల పాటు రోజు వారీ విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం అక్టోబర్ 16న తీర్పును వాయిదా వేసింది. అదే రోజున మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక సమర్పించింది.
ఇదీ చూడండి: అయోధ్య కేసు: నివేదిక సమర్పించిన మధ్యవర్తిత్వ కమిటీ