అయోధ్యలోని బాబ్రీ మసీదు ఉన్న స్థలం రామ జన్మస్థలమని.. హిందూ సంస్థలు మొదటి నుంచి వాదిస్తూ వచ్చాయి. అయోధ్యలో రామాలయాన్ని ఇంచుమించుగా 11వ శతాబ్దంలో విక్రమాదిత్య చక్రవర్తి నిర్మించి ఉంటారని.. కోర్టుల్లో వాదనలు వినిపించాయి.
ఆ గుడిని 1526లో బాబర్‌లేదా 17వ శతాబ్దంలో ఔరంగజేబు ధ్వంసం చేశారని తెలిపాయి. వాల్మీకి రామయాణం, స్కంద పురాణం వశిష్ఠ సంహిత వంటి పురాతన గ్రంథాలు, క్రీస్తుశకం 400 సంవత్సరంలో ఫా హియన్ 600-670 మధ్యలో హ్యుయెన్ త్సాంగ్ వంటి యాత్రికుల రచనల్లో అయోధ్య, అక్కడి పూజల ప్రస్తావన ఉందని పేర్కొన్నాయి. బాబర్‌సరయూ నదిని దాటి అయోధ్యను చేరినట్లు తన పుస్తకం బాబర్‌నామాలో రాశారని గుర్తుచేశాయి. అక్కడ మసీదున్నట్లు ప్రస్తావించనేలేదని పేర్కొన్నాయి. మొఘల్‌చక్రవర్తుల కాలంలో రచించిన ‘ఐనీ అక్బరీ,‘తుజుక్‌ఎ జహంగిరీ’లోనూ ఈ నగర ప్రస్తావన ఉంది. ఈస్టిండియా కంపెనీ సహా అనేక మంది పాశ్చాత్య అధికారులు దీన్ని నమోదు చేశారని పేర్కొన్నాయి. రాముడి జన్మస్థానం అయోధ్యేననే విశ్వాసం శతాబ్దాలుగా ఉన్నట్లు అనేక ఆధారాలు చెబుతున్నాయని చెప్పాయి. వివాదాస్పద ప్రాంతంలో ఒక ఆలయం ఉండేదని అది ధ్వంసమైందని పురావస్తు శాఖ ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ మసీదును ఎక్కడైనా నిర్మించుకోవచ్చని రామజన్మ భూమి ఒక్కటే ఉందని స్పష్టం చేశాయి.
రాం లల్లా వాదనలు....
మొత్తం వివాదాస్పద ప్రాంతాన్ని రాంలల్లాకు మాత్రమే కేటాయించాలని,.. అందులో ఏ భాగాన్నీ నిర్మోహి అఖాడాకు గానీ, ముస్లిం కక్షిదారులకుగానీ కేటాయించకూడదని రాంలల్లా విరాజ్‌మాన్ ఆదినుంచీ వాదించింది. వివాదాస్పద ప్రాంతంలో రామమందిర నిర్మాణానికి మాత్రమే అనుమతివ్వాలని ఆలయం నిర్మించిన తర్వాత దాని నిర్వహణ బాధ్యతల కోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేయాలని రామజన్మ భూమి పునరుద్ధరణ సమితి వాదిస్తూ వచ్చింది.
నిర్మొహి అఖాడా ఏమందంటే...
ఇక నిర్మోహిఅఖాడా రామమందిర నిర్మాణానికి అనుమతివ్వాలంటూనే నిర్మాణానంతరం ఆలయ నిర్వహణ, పూజా కైంకర్యాల హక్కులు తమకే ఇవ్వాలని పేర్కొంది. ఇదే సమయంలో మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు వేరేచోట భూమిని సమకూర్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలనీ నిర్మోహీ అఖాడా కోరుతూ వచ్చింది.
ట్రస్ట్ ఏర్పాటు చేయాలని హిందూ మహాసభ...
రామాలయ నిర్వహణ బాధ్యతలు చూసుకోవడానికి ఒక ట్రస్ట్‌ఏర్పాటు చేయాలని, సదరు ట్రస్టుకు న్యాయస్థానమే.. ఒక అధికారిని నియమించాలని అఖిల భారత హిందూ మహాసభ వాదించింది.
షియా వక్ఫ్ బోర్డ్...
షియా వక్ఫ్‌బోర్డు కూడా... వివాదాస్పద స్థలంపై ముస్లిం పక్షాలు హక్కులు కోరవద్దంటూనే ఆ స్థలానికి తామే హక్కుదారులమని వాదించింది. అక్కడ రామాలయం నిర్మించాలని కోరింది.
మసీదు ఉందన్న ముస్లిం పక్షాలు..
ముస్లిం పక్షాలు మాత్రం అయోధ్య భూ వివాదంపై మరోలా వాదిస్తూ వచ్చాయి. వివాదాస్పద ప్రాంతంలో 1528 నుంచి మసీదు ఉండేదని, 1855, 1934ల్లో దానిపై దాడులు జరిగినట్లు రికార్డుల్లో నమోదైందని కోర్టులకు వివరించాయి. వాల్మీకి రామాయణంగానీ రామచరిత మానస్‌గానీ అయోధ్యలో రాముడి జన్మ ప్రదేశాన్ని నిర్దిష్టంగా నిర్వచించలేదని తెలిపాయి. మసీదుకు బాబర్‌నిధులు ఇచ్చారని, ఆ తర్వాతి నవాబులూ ఆ పరంపరను కొనసాగించారని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించినట్లు చెప్పుకొచ్చాయి వివాదాస్పద స్థలం ముస్లింల అధీనంలోనే ఉండేదని 1949 డిసెంబరు 22, 23 వరకూ అక్కడ ఈద్‌ప్రార్థనలూ జరిగాయని ముస్లిం పక్షాలు వాదించాయి. రామ జన్మభూమిలో దేవుడి ప్రతిమ ఉన్నట్లు ఎక్కడా ప్రత్యక్ష ఆధారాల్లేవని తెలిపాయి. అక్కడ ఆలయం ఉండేదన్న పురావస్తు శాఖ నివేదికకు శాస్త్రీయ ఆధారం లేదని వాదించాయి.
సున్నీ వక్ఫ్ బోర్డు....
1989 వరకూ హిందువులు వివాదాస్పద స్థలంపై హక్కులు కోరలేదని, ముస్లిం కక్షిదారులు దావా వేశాకే హిందువులు పిటిషన్ వేశారని తెలిపారు. వివాదాస్పద ప్రాంతంలోని ‘రామ్‌ఛబుత్ర, సీతా రసోయి, హిందువుల అధీనంలో ఉన్నంత మాత్రాన వారికి స్థల యాజమాన్య హక్కులు దక్కవని, ప్రార్థనా హక్కులు మాత్రమే లభిస్తాయని తెలిపారు. 1992 డిసెంబరు 6న చోటుచేసుకున్న ఘటనకు ముందు ఉన్నట్టే బాబ్రీ మసీదును పునరుద్ధరించాలని.. సున్నీవక్ఫ్‌బోర్డు వాదించింది. అన్ని వాదనలు విన్న కోర్టు..ప్రస్తుత తీర్పు వెలువరించింది.