ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో ఎంపీలతో ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌తో ముప్ఫై మంది ఎంపీలు ఇష్టాగోష్ఠిలో పాల్గొన్నారు. సుమారు గంటపాటు సాగిన ఈ కార్యక్రమంలో జీవితంలో ఎదురవుతున్న విభిన్న అంశాలపై ఆయన మార్గదర్శనం కోరారు. ఇందులో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్‌సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి మురళీధరన్ తదితరులు పాల్గొన్నారు.
"పార్లమెంటు సభ్యులు అంతఃశుద్ధిని(మెంటల్ హైజీన్) పెంపొందించుకోవాలి. తద్వారా ఆలోచనల్లో, చేసే పనిలో స్పష్టత వస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇందుకు రోజూ కొన్ని నిమిషాలు కేటాయిస్తే జీవితంలో పురోగతి సాధ్యమవుతుంది. ఎంపీలు అత్యున్నత శక్తితో పనిచేయాలి. మంచి ఆహారం, గాలి, ధాన్యమే ఆ శక్తి సముపార్జనకు వనరులు.’’
-శ్రీ శ్రీ రవిశంకర్, ఆధ్యాత్మిక గురువు
జీవిత పరమార్థం, ఒత్తిళ్లు, కోపం, ఆధ్యాత్మికత, నిర్వికార జీవితం, ప్రజల అంచనాలను ఎదుర్కోవడం, పని ఒత్తిళ్లను అధిగమించడం, మానవతా విలువల ప్రోత్సాహం, యువతను సరైన దారిలో నడిపించడం వంటి విషయాలపై రవిశంకర్ సలహాలిచ్చారు. ఎంపీలతో పాటు ప్రతి ఒక్కరూ ఇతరుల మాట వినే ఓర్పును అలవర్చుకోవాలని సూచించారు. ఒత్తిడి, కోపాన్ని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ రోజూ ప్రాణాయామం చేయాలని సూచించారు.
మానవతా విలువలు పెంపొందించడం గురించి ఎంపీలు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... ‘‘జపాన్.. బృంద పనికి ప్రతీక. జర్మనీ స్పష్టతకు నిదర్శనం. బ్రిటన్ మర్యాదలకు ఆలవాలం. అమెరికా మార్కెటింగ్‌కు ప్రతిబింబం. భారత్ మానవతా విలువలకు నిలయం. కుటుంబాలు, సమాజంలో ఉన్న ఈ విలువలను బలోపేతం చేయాల్సిన అవసరముంది.’’ అని చెప్పారు.
సంఘర్షణలో ఆధునిక జీవితం
తొలుత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ‘‘అంతర్గత ప్రశాంతత కోసం అన్వేషణ పెరుగుతోంది. ఆధునిక జీవితం... భౌతికవాదం, ఆధ్యాత్మికత, అత్యాశ, పని ఒత్తిళ్ల మధ్య సంఘర్షణగా మారింది. సమున్నత సాంస్కృతిక వారసత్వం, ఆధునికతల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇలాంటి ఒత్తిళ్ల మధ్య ఉన్న ఎంపీలకు లబ్ధి చేకూర్చడానికి శ్రీశ్రీ రవిశంకర్ దిల్లీ పర్యటనను సానుకూలంగా మలచుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశాం’’ అని చెప్పారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి మురళీధరన్, హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు... భాజపా, కాంగ్రెస్, డీఎంకే, అన్నాడీఎంకే, బీజేడీ, తెరాస, వైకాపా, తెదేపా ఎంపీలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వైఎస్ చౌదరి, సుబ్బరామిరెడ్డి, కె.కేశవరావు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కనకమేడల రవీంద్రకుమార్ హాజరయ్యారు.
ఇదీ చూడండి : మహాలో కొలువుదీరనున్న ప్రభుత్వం.. నేడే ఠాక్రే ప్రమాణం