పైలట్ కెప్టెన్ తెలివిగా వ్యవహరించడం వల్లే తాము ప్రాణాలతో ఉన్నామని కేరళలోని కొజికోడ్‌లో విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికులు అన్నారు. ప్రమాదం తరవాత మంటలు చెలరేగకుండా పైలట్ చాకచక్యంగా స్పందించారని చెప్పారు. అప్రమత్తంగా వ్యవహరించిన పైలట్, ప్రమాదం గురించి తెలియగానే వెంటనే స్పందించిన స్థానికుల వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని ఘటనను తలుచుకొని భయాందోళనలకు గురయ్యారు. సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరేలోపే అక్కడున్న ప్రజలు పొగ, చిన్నపాటి మంటలను లెక్కచేయకుండా, తమను బయటకు తీసుకువచ్చారని కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా, చురుగ్గా స్పందించిన కెప్టెన్ దీపక్ సాథే మాత్రం ఈ విమాన ప్రమాదంలో మరణించారు.
19 మంది మృతి..
కరోనా మహమ్మారి కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం నిర్వహించిన వందే భారత్ మిషన్‌లో భాగంగా గమ్యస్థానానికి చేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ రన్‌వే మీద అదుపుతప్పి, లోయలోపడిపోయింది. ప్రమాదానికి గురైన విమానంలో చిన్నారులు, సిబ్బందితో కలిపి 190 మంది ఉండగా..వారిలో 19 మంది మరణించారని విమానయాన శాఖ అధికారులు తెలిపారు. 23 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: కేరళ విమాన ప్రమాద మృతుల్లో ఒకరికి కరోనా