ఎన్నికల సమయంలో ఆదాయపు పన్ను, ఈడీ వంటి సంస్థలు నిష్పక్షపాతంగా, తటస్థంగా విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఎన్నికల సంఘం సూచించింది.
మధ్యప్రదేశ్లో రాజకీయ నేతలు, సంబంధీకుల ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు ఆదివారం విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఇటీవలే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయ నేతలు, వారికి సంబంధించిన వారిపై దాదాపు 55 ఐటీ దాడులు జరిగాయి. ఆదాయపు పన్ను శాఖ, ఈడీ లాంటి సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ తమపై కక్ష సాధిస్తోందని ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఈసీ సూచనలను జారీ చేసింది. కేంద్ర రెవెన్యూ కార్యదర్శికి లేఖ రాసింది.
" ఎన్నికల సమయంలో మీ పరిధిలోని ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్లు నిష్పక్షపాతంగా, తటస్థంగా పని చేశాలా సూచనలు జారీ చేయండి. ఎన్నికలకు ఎవరైనా అక్రమంగా నగదును వినియోగిస్తుంటే ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి తప్పకుండా తెలియజేయాలి" అని లేఖలో పేర్కొంది ఎన్నికల సంఘం.
ఇదీ చూడండి : ఉత్తరాన ఐటీ దాడుల కలకలం