శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తగా.. దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు వైద్యులు. కార్డియో న్యూరో సెంటర్లోని ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైన జైట్లీని ఉదయం 10 గంటలకు ఎయిమ్స్‌లో చేర్చారు. పరిశీలించిన వైద్యులు.. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన గుండె పంపింగ్ స్థిరంగా ఉందని, రక్త ప్రసరణ బాగానే ఉన్నట్లు ప్రకటించారు డాక్టర్లు. ఎండోక్రైనాలజిస్టులు, హృద్రోగ నిపుణులు, మూత్రపిండాల నిపుణులతో కూడిన వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని తెలిపాయి ఆసుపత్రి వర్గాలు.
ఈ ఏడాది మే నెలలో కూడా జైట్లీ అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చేరారు.
మోదీ, షా ఆరా..
జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ఎయిమ్స్‌కు వచ్చారు. ఆయనను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆర్థిక మంత్రిగా కీలక పాత్ర...
వృత్తిరీత్యా న్యాయవాది అయిన జైట్లీ.. మునుపటి మోదీ సర్కారులో కీలక పాత్ర పోషించారు. ఆర్థిక, రక్షణ శాఖలను నిర్వహించారు. ప్రభుత్వంలో వివాద పరిష్కర్తగా గుర్తింపు పొందారు. అనారోగ్యం కారణంతో ఆయన 2019 సాధారణ ఎన్నికల్లో పోటీ చేయలేదు.