ఆత్మహత్య చేసుకొనేలా ఓ ఇంటీరియర్ డిజైనర్‌ను ఉసిగొల్పారన్న ఆరోపణలతో అరెస్టయిన రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామిని.. కొవిడ్ సెంటర్‌గా తీర్చిదిద్దిన పాఠశాలకు తరలించారు. ఈ నెల 18 వరకు కోర్టు ఆయనకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో అలీబాగ్ కారాగార పరిధిలోని ఓ పాఠశాలలో ఉన్న కొవిడ్ సెంటర్‌కు తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రంతా ఆయన అక్కడే ఉన్నట్లు చెప్పారు. వైద్య పరీక్షల నిమిత్తం అర్ణబ్‌ను బుధవారం సాయంత్రం అలీబాగ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
మరోవైపు, అర్ణబ్ సహా ఆయన కుటుంబ సభ్యులపై మరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, వారిపై దాడి చేయడం, దూషణలు, బెదిరింపులకు పాల్పడినందుకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పత్రాలను చించేయడానికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.
బెయిల్ పిటిషన్లపై విచారణ
అర్ణబ్ బెయిల్ పిటిషన్‌పై అలీబాగ్ కోర్టు గురువారం విచారణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని అర్ణబ్ నవంబర్ 2న బాంబే హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ సైతం గురువారమే హైకోర్టు విచారణకు రానుంది.
రెండేళ్లనాటి కేసులో అర్ణబ్‌తో పాటు అరెస్టయిన మరో ఇద్దరికి సైతం కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కట్టడీ విధించింది. 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు పాల్పడేలా ఉసిగొల్పారన్న కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఇదీ చదవండి- 'ఆత్మహత్య' కేసులో అర్నబ్ గోస్వామి అరెస్టు