లద్దాఖ్‌లో పరిస్థితిపై సమీక్షించేందుకు మహాదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. సరిహద్దులో చైనా ఎలాంటి దుస్సాహసాలకు పాల్పడినా దీటుగా బదులిచ్చేలా సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసినట్లు పేర్కొన్నాయి. జల,వాయి, భూమార్గంలో చైనా కార్యకలపాలపై పటిష్ఠ నిఘా ఉంచాలని, సరిహద్దు వద్ద భిన్నమైన వ్యూహాత్మక విధానాన్ని అనుసరించాలని త్రివిధదళాల అధిపతులకు రాజ్‌నాథ్ సూచించినట్లు సమాచారం.
గల్వాన్‌లోయలో చైనా సైనికులతో ఘర్షణ అనంతరం 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత సైన్యం మరింత అప్రమత్తమైంది. యుద్ధ విమానాలతో సరిహద్దులో గస్తీ పెంచింది. ఇప్పటికే భారీగా బలగాలను మోహరించింది.