పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న గిల్గిత్, బాల్టిస్థాన్, ముజఫరాబాద్ ప్రాంతాలను.. భారత వాతావరణ విభాగంలోకి తీసుకొస్తూ జమ్ముకశ్మీర్ ప్రాంతీయ వాతావరణ విభాగం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాల వాతావారణ సూచీని... వాయవ్య వాతావరణ విభాగం వెలువరించనుందని ఐఎండీ ప్రాంతీయ అధికారి కుల్దీప్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ప్రాంతాలు జమ్ము కశ్మీర్ సబ్ డివిజన్ పరిధిలోకి వస్తాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. జమ్ముకశ్మీర్ వాయవ్య విభాగంలో.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, దిల్లీ-చండీగఢ్-హరియాణా, పంజాబ్, తూర్పు ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ రాజస్థాన్ అనే తొమ్మిది ఉపవిభాగాలున్నాయి. ఇప్పటి నుంచి పీఓకే ప్రాంతాలు కూడా ఈ భాగాల్లో ఒకటిగా గుర్తించినట్లు తెలిపారు.
జమ్ముకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించినప్పటి నుంచి... పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల వాతావరణ బులిటెన్ విడుదల చేస్తున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మోహపాత్ర తెలిపారు.
పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఈ పీఓకే ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు అనుమతించిన కొద్ది రోజులకే జమ్ముకశ్మీర్ వాతావరణ విభాగ అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.