పాక్ అర్థవంతమైన చర్యలు తీసుకోవాలి : భారత్-అమెరికా ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు భారత్-అమెరికా మరోసారి పిలుపునిచ్చాయి. పాకిస్థాన్ తన భూభాగంలోని ఉగ్రవాదులపై అర్థవంతమైన, తిరుగులేని చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో నినదించాయి. అమెరికాలోని వాషింగ్టన్లో ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పరస్పర సహకారంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఇరుదేశాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భారత్ బృందానికి విదేశాంగ ఉమ్మడి కార్యదర్శి మహావీర్ సింఘ్వీ నేతృత్వం వహించారు.ఈ సందర్భంగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల నుంచి పొంచి ఉన్న సవాళ్లపై ఇరుదేశాలు చర్చించాయి. ఉగ్రవాదుల ఆర్థిక మూలాలు, అంతర్జాల వినియోగం, పునరావాసం, ఉగ్రవాద కార్యకలాపాలు వంటి అంశాలపై భారత్-అమెరికాలు పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నాయి. ఉగ్రవాద సంస్థలపై విధించే ఆంక్షలపైనా ఇరు దేశాలు చర్చించాయి.