ప్రజలు, విద్యార్థులను హింసకు ఉసిగొల్పడం నాయకత్వం కాదని భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ ఉద్ఘాటించారు. నిజమైన నాయకుడు ప్రజలను సరైన మార్గంలో నడిపిస్తాడన్నారు. దేశంలో పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో రావత్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
"ముందుండి నడిపించడమే నాయకత్వం అంటే. ప్రజల్లోంచి నాయకుడు ఉద్భవిస్తాడు. ప్రజలను సరైన మార్గంలో నడిపించకపోవడం నాయకత్వం కాదు. అనేక విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఆయుధాలు పట్టుకుని హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ఇది కూడా నాయకత్వం కాదు. మనకు సరైన సూచనలు ఇస్తూ.. ముందుండి నడిపించేవాడే నిజమైన నాయకుడు. నిత్యం తన ప్రజల కోసం ఆలోచించే వాడు నాయకుడు."
--- బిపిన్ రావత్, భారత సైన్యాధిపతి.
ఈ నెలలో పౌరసత్వ చట్ట సవరణను పార్లమెంట్ ఆమోదించినప్పటి నుంచి దేశంలో నిరసనలు చెలరేగుతున్నాయి. పలు సందర్భాల్లో ఆ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అనేక మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు.
'అయితే మోదీ చేసింది కూడా తప్పే..'
బిపిన్ రావత్ వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాల్ని బలహీనం చేస్తున్నాయని.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. అత్యయిక పరిస్థితి సమయంలో దేశంలో చెలరేగిన నిరసనల్లో మోదీ పాల్గొన్నారని.. ఆ విషయాన్ని స్వయంగా మోదీనే అంగీకరించారని గుర్తుచేశారు. ఇప్పుడు సైన్యాధిపతి వ్యాఖ్యల ప్రకారం మోదీ చేసింది కూడా తప్పేనని విమర్శించారు.