సీఏఏకు వ్యతిరేకంగా బెంగళూరులో గురువారం నిర్వహించిన సభలో అమూల్య లియోన్ అనే యువతి పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం తీవ్ర కలకలం సృష్టించింది. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా సభ నిర్వహించగా మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ సభకు హాజరై ప్రసంగించారు. అయితే ఓవైసీ ప్రసంగం తర్వాత 19 ఏళ్ల అమూల్య లియోన్ ఒక్కసారిగా వేదికపైకి చేరుకొని పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేసింది. షాక్‌కు గురైన ఓవైసీ వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి మైక్‌ను లాక్కొనే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ యువతి వెనక్కి తగ్గకపోవడం వల్ల పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అమూల్యకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది
ఓవైసీ వివరణ
ఆ యువతితో తనకు గానీ, తన పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని ఓవైసీ వివరణ ఇచ్చారు. ఆమెను ఈ సభకు ఆహ్వానించలేదని నిర్వాహకులు కూడా స్పష్టం చేశారు. తమ సభను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు చేసిన కుట్రగా దీన్ని అభివర్ణించారు. ఈ అంశంపై భాజపా, కాంగ్రెస్ పరస్పర ఆరోపణలకు దిగాయి.
జైల్లో పెట్టినా తప్పులేదు
అమూల్య ప్రవర్తించిన తీరుపై ఆమె తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి కూతుర్ని జైల్లో పెట్టినా తప్పులేదని, ఆమె కోసం ఎలాంటి న్యాయపోరాటం చేయమని స్పష్టం చేశారు.
అమూల్య తీరును నిరసిస్తూ బెంగళూరులో శ్రీరామ్ సేన, హిందూ జనజాగృతి సమితి సభ్యులు ఆందోళనకు దిగారు. ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అమూల్యకు బెయిల్ మంజూరు చేయకూడదని కర్ణాటక సీఎం యడియూరప్ప అభిప్రాయపడ్డారు. ఆమెను రక్షించేందుకు తండ్రి విముఖత వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు యడియూరప్ప. అమూల్యకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయనే దాన్ని ఇది రుజువు చేస్తోందన్నారు. సరైన దర్యాప్తు జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: శివరాత్రి వేళ మాజీ సీఎం తనయుడి వేణుగానం