ఒడిశాలోని భువనేశ్వర్‌లో నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ చట్ట సవరణ(సీఏఏ) అనుకూల ర్యాలీని నిర్వహించనున్నారు. ఇందుకోసం జనతా మైదాన్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. దిల్లీ అల్లర్లు జరిగిన కొద్ది రోజుల వ్యవధిలో ఈ ర్యాలీ జరుగుతుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది.
నగరంలో జరగనున్న తూర్పు జోనల్ మండలి(ఈజెడ్‌సీ) సమావేశం అనంతరం షా ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. ఈ మండలి సమావేశానికి నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. వీరిలో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒకరు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా ఇందులో పాల్గొననున్నారు. అయితే నవీన్-నితీశ్ సీఏఏను సమర్థిస్తుండగా.. ఎన్ఆర్సీని మాత్రంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
'వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు'
గతేడాది పార్లమెంట్ ఆమోదించిన సీఏఏపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తేల్చిచెప్పారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లను ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. మతపరమైన హింసకు గురై పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌ల నుంచి వచ్చే వాళ్లకు భారత పౌరసత్వం ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని ప్రశ్నించారు.
సీఏఏను వ్యతిరేకించే వాళ్లను ఒప్పించేందుకు ప్రయత్నిస్తామన్న రవిశంకర్.. నిద్రపోయేవాళ్లను లేపడం సులభమే గానీ.. నిద్ర నటించేవాళ్లను మేల్కొల్పడం ఎవరితరమూ కాదని వ్యాఖ్యానించారు. అన్ని మతాల ప్రజలు శాంతియుతంగా కలిసిమెలిసి జీవించడమే భారతదేశ విలక్షణీయత అని వ్యాఖ్యానించారు.