గుజరాత్‌పై 'వాయు' తుపాను ప్రభావం దృష్ట్యా ముందస్తు సహాయక చర్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను తీవ్రత నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలని ఆదేశాలు జారీ చేశారు.
"తుపాను వీడిన తర్వాత విద్యుత్, టెలికాం, ఆరోగ్యం, తాగునీరు తదితర వ్యవస్థలను వేగంగా పునరుద్ధరించేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలి. తుపాను తీవ్రత అధికంగా ఉండే ప్రదేశాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. 24 గంటలు కంట్రోల్ రూంలు పనిచేయాలి."
-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
ముందస్తు సహాయక చర్యల కోసం ఇప్పటికే 26 జాతీయ విపత్తు స్పందన దళాలను గుజరాత్‌కు పంపించారు. ఒక్కో బృందంలో 45 మంది సిబ్బంది ఉంటారు. వీరితో పాటు పడవలు, ట్రీ కట్టర్స్, టెలికాం పరికరాలను తరలించారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో మరో 10 బృందాలను పంపించాలని ఎన్డీఆర్ఎఫ్ నిర్ణయించింది.
గుజరాత్‌తో పాటు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, దమన్ దీవ్లపైనా తుపాను ప్రభావం ఉండనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్‌లోని పోరుబందర్, మహువా మధ్య గురువారం ఉదయం తీరం దాటనుందని వెల్లడించింది. గంటకు సుమారు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించింది. ఈ రాష్ట్రాలతో ముందుజాగ్రత్తగా హోంశాఖ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.
ఇదీ చూడండి: 'వాయు' వేగంతో దూసుకొస్తోన్న తీవ్ర తుపాను