ఆర్టికల్ 370, 35ఏ రద్దు జమ్ముకశ్మీర్ ప్రజలకు లాభం చేకూరుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 కశ్మీర్ ప్రజలకు అన్యాయం చేసిందన్నారు. సాధారణ పరిస్థితి నెలకొనేందుకు ఎంత సమయం పడితే అప్పటివరకు కేంద్ర పాలిత ప్రాంతంగానే ఉంటుందన్నారు.
కశ్మీర్ యువత పరిస్థితిలో మార్పు రావాలన్నా, రాష్ట్రంలో అభివృద్ది జరగాలన్నా, మహిళలకు సాధికారత, విద్యార్థులకు నిరాటంకంగా విద్య అందాలన్నా 370 రద్దు తప్పనిసరని స్పష్టం చేశారు.
"జమ్ముకశ్మీర్‌లో దీర్ఘకాలంగా ఉన్న రక్తపాతం ఈ ఆర్టికల్ రద్దుతో పరిసమాప్తమవుతుందని నేను విశ్వశిస్తున్నా. మేము ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాం అంటున్నారు. కశ్మీర్ లోయలో కేవలం మస్లింలే ఉంటారా? అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? లోయలో అన్ని మతాల వారు ఉంటారు. ఆర్టికల్ 370 మంచిదైతే అందరికీ మంచిదే... చెడ్డదైతే అందరికీ నష్టమే. మేము ధర్మంతో రాజకీయం చేయం."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
అమిత్ షా ప్రసంగంలో మరిన్ని అంశాలు...
- 370 లేకుంటే మరణాలు సంభవించేవి కావు.
- పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థులకు కశ్మీర్‌లో ఇప్పటివరకు పౌరసత్వం లభించలేదు. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఐకే గుజ్రాల్, మన్మోహన్‌సింగ్‌కు ప్రధాని పదవి లభించింది. కానీ పాక్ నుంచి వచ్చి కశ్మీర్‌లో స్థిరపడ్డ వారికి నేటి వరకు కౌన్సిలర్ పదవీ రాలేదు. ఇదెక్కడి అన్యాయం?
- 370 కశ్మీర్ ప్రజలకు అన్యాయం చేసింది. అక్రమాలు జరిగాయి.
- ఎప్పటివరకైతే సాధారణ పరిస్థితి ఉంటుందో అప్పటివరకు యూటీగా ఉంటుంది.
కశ్మీర్ యువతపై
- పాక్ కుట్రపూరితంగా సాగించిన చర్యలకు కశ్మీర్ యువత బలయ్యారు.
- ఉగ్రవాదమనే విషవృక్షాన్ని పెకలించేందుకే కశ్మీర్‌లో ఈ పరివర్తన.
- 370 ఉన్నంతవరకు కశ్మీర్ యువత భారత్‌లో కలవదని జియావుల్ హక్ ఆనాడే చెప్పారు. వేర్పాటువాదుల పిల్లలంతా అమెరికా, ఇంగ్లండ్‌లో చదువుకుంటారు.
- 370 అధికరణానికి పట్టుబట్టే వారి పిల్లలు ఎక్కడున్నారో గుర్తుచేసుకోవాలి.
- జమ్ముకశ్మీర్ యువతకు మంచి భవిష్యత్తు అందించాలని అనుకుంటున్నాం.
- జమ్ముకశ్మీర్ యువతులు ఇతరప్రాంతాల వారిని పెళ్లి చేసుకుంటే ఆస్తి హక్కులు కోల్పోతున్నారు.
సాధికారతపై..
- జమ్ముకశ్మీర్ మహిళలకు సాధికారత రావాలంటే 370 రద్దు కావాలి.
- జమ్ముకశ్మీర్‌లో ఓబీసీలకూ రిజర్వేషన్లు అమలుకావడం లేదు.
- పాక్ నుంచి వచ్చిన శరణార్థులకు దేశవ్యాప్తంగా ఓటుహక్కు వచ్చింది. ఆ శరణార్థులకు జమ్ముకశ్మీర్‌లో మాత్రం ఓటుహక్కు రాలేదు.
అభివృద్ధిపై...
- పరిశ్రమలు పెట్టాలని అనుకునేవారికి ఆర్టికల్ 370 అడ్డంకిగా మారింది. పెద్ద కంపెనీలు వెళ్లాలంటే ఆర్టికల్ ఆటంకంగా మారింది. పర్యటన రంగం ఈ అధికరణ కారణంగా బయటి వ్యక్తులు వెళ్లే అవకాశాలు మూసివేశారు.
- సంస్కృతి, సంప్రదాయాల గురించి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో కలిసిన ఏ ఇతర రాష్ట్రంలోనైనా వారి సంస్కృతి, సంప్రదాయాలు యథాతథంగా ఉన్నాయి.
- ప్రజలకు సరైన ఆరోగ్య సదుపాయాలు కల్పించలేకపోయారు. మంచి వైద్యుడు జమ్ముకశ్మీర్ వెళ్లే పరిస్థితి ఇవాళ లేదు. జమ్ముకశ్మీర్‌లో భూమి కొనేందుకు అవకాశం లేదు, ఆస్పత్రి కట్టేందుకూ అవకాశం లేదు. వీటిన్నంటికీ 370 అధికరణే కారణం.
- విద్యాహక్కు చట్టం నేటికీ జమ్ముకశ్మీర్‌లో అమలు కావడం లేదు. రేపు లోక్‌సభ ఆమోదించిన వెంటనే జమ్ముకశ్మీర్‌లోని ప్రతి చిన్నారికి విద్య అందుతుంది.
ఇవీ చూడండి: కశ్మీర్ 'హోదా రద్దు, విభజన'కు రాజ్యసభ ఆమోదం