సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఎన్డీఏ... కేంద్ర మంత్రివర్గ కూర్పుపై కసరత్తులు చేస్తోంది. కేంద్ర హోంమంత్రి బాధ్యతలను భాజపా అధ్యక్షుడు అమిత్‌షా చేపట్టవచ్చని సమాచారం.
రేపు (మే 30న) సాయంత్రం 7 గంటలకు ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటే కేంద్ర మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉంది. ముందుగా రాజ్‌ఘాట్, స్మృతిస్థల్ వద్దకు మోదీ సహా భాజపా ఎంపీలు వెళతారు. మహాత్మ గాంధీ, వాజ్‌పేయి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమానికి ఎంపీలంతా తప్పక హాజరుకావాలని ఇప్పటికే భాజపా అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.
షాతో నితీశ్ కుమార్ భేటీ
అమిత్‌షాతో బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ భేటీ అయ్యారు. మంత్రివర్గంలో జేడీయూకు స్థానం కల్పించడంపై చర్చించారు.
సేవలకు సెలవు
ఇన్నాళ్లూ కేంద్ర ఆర్థికమంత్రిగా సేవలందించిన ఆరుణ్‌జైట్లీ ఇకపై మంత్రి పదవిలో కొనసాగలేనని ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆరోగ్య కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
విస్తృత భేటీలు
మంత్రివర్గ కూర్పు విషయంపై మంగళవారం 5గంటల పాటు నరేంద్ర మోదీ-అమిత్ షా చర్చించుకున్నారు. నేడు మరోసారి భేటీ అయ్యారు. హోంమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాలని అమిత్‌షాను మోదీ కోరినట్లు సమాచారం. నేటి రాత్రి లేదా రేపు ఉదయం కొత్త మంత్రి మండలి జాబితా ఖరారవుతుంది. ఈ జాబితాను రాష్ట్రపతి కార్యాలయానికి ప్రధానమంత్రి కార్యాలయం పంపుతుంది.
గతంలోనూ...
గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు, అమిత్‌షా హోంమంత్రిగా పనిచేశారు. అయితే సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసు వల్ల ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు.
మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అమిత్‌షా... ఈ సార్వత్రిక ఎన్నికల్లో గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.
ఇదీ చూడండి: పెద్దల సభకు వెళ్లే అవకాశం ఎవరికో...?