మార్పు కోసం బంగాల్ ప్రజలు ఆరాటపడుతున్నారని.. రాజకీయ హింస, దోపిడీ, బంగ్లదేశీయుల చొరబాట్లు లేని రాష్ట్రాన్ని చూడాలనుకుంటున్నారని తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీర్భమ్ జిల్లాలోని బోల్పుర్లో నిర్వహించిన భారీ రోడ్ షోలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భాజపాకు అధికారం ఇస్తే.. 'బంగారు బంగాల్'ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
"నా జీవితంలో చాలా రోడ్ షోలలో పాల్గొన్నా. కానీ ఇలాంటి రోడ్ షోను ఎప్పుడూ చూడలేదు. ప్రధాని మోదీ పట్ల బంగాల్ ప్రజల నమ్మకం, ప్రేమను ఈ రోడ్ షో తెలియచెబుతోంది. అలాగే.. మమతా దీదీ పట్ల బంగాల్ ప్రజల ఆగ్రహాన్ని సూచిస్తోంది. బంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అది రాజకీయ నాయకుడి మార్పు మాత్రమే కాదు. రాజకీయ హింస, దోపిడీ, బంగ్లాదేశీయుల చొరబాట్లు లేని బంగాల్ను చూడాలనుకుంటున్నారు. నరేంద్ర మోదీకి ఒక్క అవకాశం ఇవ్వండి. ఐదేళ్లలో బంగారు బంగాల్ను నిర్మిస్తాం."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
అమిత్ షాతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, కీలక నేతలు రోడ్ షోలో పాల్గొన్నారు. మద్దతుదారులు రహదారుల వెంట బారులు తీరి... 'జై శ్రీరాం', 'నరేంద్ర మోదీ జిందాబాద్', 'అమిత్ షా జిందాబాద్' నినాదాలతో హోరెత్తించారు. డాక్బంగ్లో మైదానం నుంచి బోల్పుర్ చౌరస్తా వరకు సాగిందీ రోడ్ షో.
ఇదీ చూడండి: జానపద గాయకుడి ఇంట్లో అమిత్ షా విందు