మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలై వారం రోజులు గడిచినా.. ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ముఖ్యమంత్రి పీఠంపై భాజపా- శివసేన మధ్య నెలకొన్న ప్రతిష్టంభనే ఇందుకు కారణం. అయితే ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన తన వైఖరితో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. 50-50 ఫార్ములా అమలు చేస్తేనే భాజపాకు మద్దతిస్తామని తేల్చి చెబుతున్న శివసేన నేతలు.. గురువారం సాయంత్రం గవర్నర్‌ను కలిశారు. ఎన్నికల్లో తొలిసారి పోటీపడి ఘన విజయం సాధించిన ఆదిత్య ఠాక్రే సహా అనేక మంది సీనియర్ నేతలు రాజ్‌భవన్‌కు తరలివెళ్లారు. ఇది జరిగిన కొద్ది సేపటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌తో భేటీ అయ్యారు.. శివసేన ముఖ్య నేత, ఎంపీ సంజయ్ రౌత్. ఈ పరిణామాల మధ్య రాష్ట్రంలో భాజపాయేతర ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి.
దక్షిణ ముంబయిలోని పవార్ నివాసానికి వెళ్లిన రౌత్.. ఎన్సీపీ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. వీరి మధ్య జరిగిన చర్చలపై తొలుత ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల రాష్ట్రంలో భాజపాయేతర ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయన్న వార్తలు పెరిగాయి.
శరద్ పవార్‌కు దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్లినట్టు రాజ్యసభ ఎంపీ తెలిపారు. దానితో పాటు మహారాష్ట్రలోని తాజా రాజకీయాలపై చర్చించినట్టు స్పష్టం చేశారు సంజయ్ రౌత్.