పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్రమోదీ. ప్లాస్టిక్ రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు ఉద్యమించాలని సూచించారు.
మోదీ పిలుపుతో ఇప్పుడిప్పుడే ఈ మార్గంలో ప్రజలు నడుస్తున్నారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్ నగరపాలక సంస్థ (ఏఎంసీ) ఈ దిశగా 2014లోనే తన కృషిని ప్రారంభించింది. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే పథకం ప్రవేశపెట్టి స్ఫూర్తిగా నిలిచింది. ఘనవ్యర్థాల నిర్వహణలో ఇతర రాష్ట్రాలు, నగరాలకు ఆదర్శమైంది.
వ్యర్థాల నిర్వహణ..
నగరంలో సేకరించిన వ్యర్థాలను వాటి స్వభావాన్ని బట్టి వేరుచేస్తుంది ఏఎంసీ. వీటన్నింటినీ తిరిగి వినియోగించేలా వ్యాపారులకు అమ్ముతారు. రంగుతో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంట్ కర్మాగారాలకు విక్రయిస్తారు. పారదర్శకంగా ఉన్నవాటిని చిన్న రేణువులుగా మార్చి వివిధ పనులకు ఉపయోగిస్తారు.
"ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రజలు తగ్గించాలనే ఇలా చేస్తున్నాం. భూమిని ప్లాస్టిక్ వ్యర్థాలు నాశనం చేస్తున్నాయి. చెత్త పెరిగిపోతోంది. వీటిని తిని పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఈ పరిస్థితులు మారాలి. ఘన వ్యర్థాల నిర్వహణలో మా నగరం ముందుంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళతాం."
-డాక్టర్ అజయ్ తిర్కీ, అంబికాపుర్ మేయర్
గార్బేజ్ కేఫ్‌తో మరో అడుగు..
పర్యావరణ పరిరక్షణలో నగరపాలక సంస్థ చూపించిన చొరవ మంచి ఫలాలను ఇచ్చింది. ఈ కార్యక్రమంతో మహిళలకు ఉపాధి కూడా లభించింది. ఇంతటితో సరిపెట్టకుండా మరో వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది ఏఎంసీ. అదే గార్బేజ్ కేఫ్. అక్టోబర్ 9న ప్రారంభమైన కేఫ్... ఎంతోమంది కడుపు నింపుతోంది.
"వ్యర్థాల నిర్వహణలో ప్రజలను భాగస్వాములను చేయటమే మా ఉద్దేశం. నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేలా ప్లాగింగ్(ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరడం)పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని భావించాం. వారు మాకు ప్లాస్టిక్ వ్యర్థాలను ఇస్తే మేం వారి ఆహారం అందిస్తాం."
-రితేశ్ సయానీ, స్వచ్ఛ భారత్ మిషన్
ఈ కేఫ్‌లో కిలో ప్లాస్టిక్ వ్యర్థాలకు భోజనం అందిస్తున్నారు. ఇలా రోజూ 10-20 కిలోల వ్యర్థాలను సేకరిస్తున్నారు. ఇలా వచ్చిన ప్లాస్టిక్‌తో నగరంలో రోడ్లను నిర్మించాలని ఏఎంసీ భావిస్తోంది.
కఠిన చట్టాల లేమితో..
ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి దేశంలో చర్చ జరుగుతోన్నా.. ఇందుకు సంబంధించి కఠిన చట్టాలేవీ ఇంతవరకు లేవు. ఈ పరిస్థితుల్లో ఏఎంసీ దేశానికి మార్గాన్ని నిర్దేశిస్తోంది. అంబికాపుర్ బాటలో మిగతా నగరాలన్నీ ప్రయాణిస్తే దేశంలో సగం ప్లాస్టిక్ బెడద తీరుతుంది.
ఇదీ చూడండి: ప్లాస్టిక్‌పై సమరం: 'చెత్త కేఫ్' ఆలోచనకు ప్రశంసలు