కరోనా రోగి పట్ల కేరళలోని ఓ వైద్య సిబ్బంది వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. కొవిడ్ సోకిన ఓ మహిళను మంచానికి కట్టేసి నిర్దయగా ప్రవర్తించారు. కలామస్సెరీ వైద్య కళాశాల ఆసుపత్రి వర్గాలు ఈ నిర్వాకానికి పాల్పడ్డాయని తెలుస్తోంది.
ఏం జరిగిందంటే..
కేరళ, త్రిస్సూర్ జిల్లాలోని కదనగోడుకు చెందిన కుంజిబీవి అనే మహిళ కుటుంబానికి అక్టోబర్ 18న కరోనా సోకింది. వారంతా కుట్టనెల్లూర్లోని కొవిడ్ ఆసుపత్రిలో చేరారు. అయితే, కుంజిబీవి ఆరోగ్య పరిస్థితి విషమించగా ఆమెను మెరుగైన చికిత్స కోసం కలామెస్సెరీ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యులు.
కిందపడి గాయాలు..
కుంజిబీవికి తోడుగా వెళ్లేందుకు ఆసుపత్రి వర్గాలు తమను అనుమతించలేదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరిన కుంజిబీవి.. చాలా బలహీనంగా మారింది. ఆమెను అక్కడి వైద్య సిబ్బంది.. మంచానికి కట్టేసి ఉంచారు. మంచం మీద నుంచి లేచేందుకు ప్రయత్నించిన ఆమె.. కిందపడి తీవ్రంగా గాయపడింది. తలకు, కళ్లకు బలంగా దెబ్బలు తగిలాయి.
ఎలా తెలిసింది..?
అదే వార్డులో ఉన్న మరో కొవిడ్ రోగి ఈ దృశ్యాలను చిత్రీకరించి.. కుంజిబీవి కుటుంబ సభ్యులకు పంపించింది. తద్వారా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కుంజిబీవి గాయాలకు ఏడు కుట్లను వేశారని ఆమె కుటుంబ సభ్యులు అన్నారు. మంచం మీద నుంచి కిందపడగా.. ఆమె దంతాలు దెబ్బతిన్నాయని వాపోయారు. ముఖంపై తగిలిన గాయాలు కందిపోయాయని, రక్తం గడ్డకట్టిందని తెలిపారు.
వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై సదరు మహిళ బంధువులు.. జిల్లా వైద్యాధికారికి, వైద్య కళాశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజకు కూడా ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
ఇదీ చూడండి:నయా చోర కళ: అంబులెన్స్‌లో వచ్చి హాంఫట్!