భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరగనున్న అనధికారిక సమావేశం కోసం సర్వం సిద్ధమైంది. మోదీతో సమావేశం కోసం శుక్రవారం మధ్యాహ్నం దిల్లీకి చేరుకోనున్నారు జిన్‌పింగ్. అనంతరం చెన్నై సమీపంలోని చారిత్రక పట్టణం మామల్లపురంకు చైనా అధ్యక్షుడిని తీసుకెళ్తారు ప్రధాని. అక్కడే ఓ ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు అధికారులు. ఆ తర్వాత జిన్‌పింగ్‌కు మోదీ ప్రత్యేక విందును ఇవ్వనున్నారు.
ఈ అనధికారిక సమావేశంలో ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు జరగనప్పటికీ.. మోదీ-జిన్‌పింగ్ ఉన్నతస్థాయి చర్చలు జరపనున్నారు. ఇందుకోసం చెన్నై తీరానికి సమీపంలోని ఓ రిసార్టు వేదికకానుంది. వాణిజ్యం, ఉగ్రవాదం, ఆర్థిక సమస్యలపై ఈ చర్చలు జరిగే అవకాశమున్నట్టు సమాచారం.
12న కూడా అగ్రనేతల మధ్య భేటీ జరగనుంది. ఆ తర్వాత ఉన్నతస్థాయి సమావేశం ఉంటుందని అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జిన్‌పింగ్.. చెన్నై నుంచి నేపాల్‌కు వెళ్లే అవకాశముంది.
2018 ఏప్రిల్‌లో మోదీ-జిన్‌పింగ్ మధ్య ఇప్పటికే ఓ అనధికారిక సమావేశం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం జిన్‌పింగ్‌తో మోదీ భేటీ కావడం ఇది మూడోసారి.
మోదీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అడిత్ డోభాల్, భారత విదేశాంగమంత్రి జయ్శంకర్ చెన్నైకు పయనమవుతారు. చైనా పోలిట్ బ్యూరో సభ్యుడు, చైనా విదేశాంగమంత్రి జిన్‌పింగ్‌తో పాటు భారత్‌లో పర్యటించనున్నారు.
ఇదీ చూడండి:- మోదీ-జిన్‌పింగ్ భేటీ మామల్లపురంలోనే ఎందుకు?