అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. ఏళ్లతరబడి నలుగుతున్న వివాదానికి ముగింపు పలికింది. ఈ కేసులో ప్రధానంగా ఉన్న ముగ్గురు కక్షిదారులు తీర్పుపై సంతృప్తి వ్యక్తం చేశారు. హిందూ, ముస్లిం పక్షాలు తీర్పును స్వాగతించాయి.
ప్రజల విజయం..
ప్రధాన పిటిషనర్ రామ్‌లల్లా విరాజ్‌మాన్ తీర్పును స్వాగతిస్తూ ఇది ప్రజల విజయమని పేర్కొంది. తీర్పు సమతూకంతో ఉందని.. ఏ ఒక్కరి పక్షానో నిలిచినట్టులేదని తెలిపింది. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ చేపడతామని వెల్లడించింది.
లక్ష్యం నెరవేరింది..
సుప్రీం తీర్పుపై స్పందించిన నిర్మోహి అఖాడా దీనిపై తమకు ఎలాంటి అసంతృప్తి లేదని తెలిపింది. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా తమ లక్ష్యం నెరవేరిందని నిర్మోహి అఖాడా సభ్యుడు మహంత్ ధర్మదాస్ అన్నారు. రామమందిర నిర్మాణంలో రామ్‌లల్లా విరాజ్‌మాన్‌కు సహకరిస్తామని తెలిపారు. ఈ విషయంలో ఎవరూ విజయం సాధించినట్టుకాదని అలాగే పరాజయం పొందినట్టు భావించరాదని అన్నారు.
సున్నీ వక్ఫ్‌బోర్డ్..
ఈ కేసులో ముస్లింల తరఫున పిటిషనర్‌గా ఉన్న సున్నీ వక్ఫ్ బోర్డు న్యాయవాది జఫర్ యాబ్ జిలానీ తొలుత తీర్పుపై అసంతృప్తి ప్రకటించారు. సమీక్షకు వెళ్తామని అన్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జఫర్ అహ్మద్ ఫారూకీ మాత్రం సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. తీర్పుపై సమీక్షకు వెళ్లే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. తీర్పుపై సమీక్షకు వెళ్తున్నట్టు ఎవరైనా చెబితే అందులో వాస్తవం లేదని అన్నారు. ఫారూకీ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన జఫర్ యాబ్ జిలానీ తాను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కార్యదర్శిగా స్పందించానని.. సున్నీ వక్ఫ్ బోర్డు న్యాయవాదిగా కాదని అన్నారు.
జాతీయ మైనారిటీ కమిషన్ సంతృప్తి
సుప్రీం తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు, ఎంఐఎం అసంతృప్తి వ్యక్తం చేయగా జాతీయ మైనారిటీ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పుతో ముస్లింలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు ఎన్సీఎం చైర్ పర్సన్ గైరుల్ హసన్ రిజ్వీ. సున్నీ వక్ఫ్ బోర్డు వ్యాఖ్యల్ని తోసిపుచ్చిన ఎన్సీఎం ఇంతకన్నా మంచి తీర్పు వస్తుందని ఆశించలేమన్నారు. ఈ తీర్పు జాతీయ సమగ్రతకు సోదర భావానికి, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని వెల్లడించారు.
స్వాగతించిన అజ్మేర్ దర్గా
అయోధ్యపై వెలువడిన చారిత్రక తీర్పును రాజస్థాన్‌లోని ప్రముఖ అజ్మేర్ దర్గా స్వాగతించింది. తీర్పు నేపథ్యంలో ప్రజలు సంయమనం పాటించాలని దర్గా మతపెద్ద దీవాన్ జైనులబ్దీన్ అలీఖాన్ కోరారు. 'న్యాయవ్యవస్థ అత్యున్నతమైంది. అయోధ్యపై తీర్పు ప్రతి ఒక్కరూ గౌరవించాలి. యావత్ ప్రపంచం భారత్ వైపే చూస్తోంది . మనదేశ ఏకత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయమిది' అని అన్నారాయన. ఈ తీర్పు నేపథ్యంలో మనమెంత శాంతికాముకులమో తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు అలీఖాన్.
సహకరించుకోవాలి..
అయోధ్య కేసు తీర్పును స్వాగతించారు కర్ణాటకలోని పెజవార్ మఠ్‌కు చెందిన విశ్వేష తీర్థ స్వామి. మసీదు నిర్మాణానికి హిందువులు సహకరించాలని సూచించారు. అలాగే రామమందిరం నిర్మాణాకి ముస్లింలూ సహకరించాలని కోరారు. దీని ద్వారా ప్రతిఒక్కరు ఐక్యంగా ఉండాలన్నారు.
సమీక్ష పిటిషన్‌కు నో..
అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు తీర్పును అంగీకరిస్తున్నామని తెలిపారు దిల్లీలోని జామా మసీదు సయ్యద్ అహ్మద్ బుఖారీకి చెందిన షాహి ఇమామ్. దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సమీక్ష పిటిషన్ దాఖలు చేసే నిర్ణయంతో తాము ఏకీభవించబోమన్నారు.
చారిత్రక తీర్పు..
అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించిందని రామ్ దేవ్ బాబా పేర్కొన్నారు. ముస్లింలకు ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల స్థలం కేటాయింటడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మసీదు నిర్మాణానికి హిందూ సోదరులు సహకరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తీర్పు నేపథ్యంలో త్వరలోనే రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.
విశ్వహిందూ పరిషత్...
సుప్రీంకోర్టు తీర్పు..అయోధ్యలో రామమందిర నిర్మాణం దిశగా నిర్ణయాత్మక అడుగుగా విశ్వహిందూ పరిషత్ అభివర్ణించింది. ట్రస్టు ఏర్పాటు తదితర అంశాలపై వేగంగా చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని కోరింది. రామ మందిర నిర్మాణానికి సంబంధించి 60శాతం పిల్లర్లు, దూలాలు సిద్ధంగా ఉన్నట్లు వివరించిన వీహెచ్‌పీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌కుమార్.. కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఇరు వర్గాలకు ఉపశమనం..
అయోధ్య విషయంలో సుప్రీం కోర్టు తీర్పు దేశ గౌరవాన్ని మరింత పెంచిందని ఆధ్యాత్మిక గురువు, మధ్యవర్తిత్వ కమిటీ సభ్యుడు శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. తీర్పును స్వాగతించిన శ్రీశ్రీ రవిశంకర్.. సుప్రీం కోర్టు ఇరు వర్గాల ప్రజలకూ న్యాయం చేకూరేలా తీర్పు వెలువరించటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్యకు సరైన ముగింపు లభించిందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అయోధ్య తీర్పును స్వాగతించిన విపక్షాలు