రాజకీయాల్లో వారసత్వం సాధారణం. దిల్లీ శాసనసభ ఎన్నికల్లోనూ ఇదే అస్త్రం ప్రయోగించాయి అక్కడి ప్రధాన పార్టీలు. భార్య, సోదరుడు, కొడుకు, కూతురు, కోడలు.. ఇలా తమవారికే టికెట్లిస్తూ రాజకీయాల్లో ఓనమాలు దిద్దిస్తున్నారు దిల్లీ నేతలు. కాంగ్రెస్ అందరికంటే ఎక్కువగా వారి వారి కుటుంబీకుల్నే రంగంలోకి దించింది.
చీఫ్ కూతురు.. స్పీకర్ తనయ... చీఫ్ భార్య...
కల్కాజీ కాంగ్రెస్ అభ్యర్థి శివానీ చోప్రా.. దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ సుభాష్ చోప్రా కూతురే. దిల్లీ మాజీ స్పీకర్ యోగానంద్ శాస్త్రి తనయ ప్రియాంక సింగ్ ఆర్కే పురం నుంచి పోటీలో ఉన్నారు.
ప్రియాంక.. ఆప్ నుంచి పర్మిలా టోకాస్, భాజపాకు చెందిన అనిల్ శర్మలతో అమీతుమీ తేల్చుకోనున్నారు. 41 ఏళ్ల ప్రియాంక ప్రస్తుతం.. దిల్లీ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు. 2008 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
ఈమె తండ్రి యోగానంద్ 1998-2008 మధ్యలో దిల్లీ మంత్రిగా సేవలందించారు. 2008 నుంచి 13 వరకు సభాపతిగా కొనసాగారు.
పూనమ్ ఆజాద్‌కు సవాల్...
దిల్లీ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు కీర్తి ఆజాద్ స్వయంగా తన భార్య పూనమ్ ఆజాద్‌నే బరిలో నిలిపారు. ఆమె సంగమ్ విహార్ నియోజకవర్గం నుంచి భవితవ్యం తేల్చుకోనున్నారు. ఇక్కడ ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మోహనియా, జేడీయూ నేత ఎస్సీఎల్ గుప్తా నుంచి ఆజాద్‌కు గట్టి పోటీ నెలకొంది.
53 ఏళ్ల పూనమ్ ఆజాద్.. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి దిల్లీ సీఎం షీలా దీక్షిత్‌పై భాజపా టికెట్‌తో పోటీ చేశారు. తనను పక్కకు తప్పిస్తున్నారని ఆరోపిస్తూ.. 20 సంవత్సరాల పాటు సేవలందించిన కాషాయ పార్టీ నుంచి బయటకొచ్చారు. అనంతరం.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. అయితే.. 5 నెలలకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
1988-89 మధ్య బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ నేత, భగవత్ ఝా ఆజాద్.. స్వయానా ఈమెకు మామ.
పూనమ్ భర్త, బిహార్ దర్భంగా మాజీ ఎంపీ కీర్తి ఆజాద్‌ను 2015 డిసెంబర్లో భాజపా బహిష్కరించింది. దిల్లీ క్రికెట్ సంఘంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి.
కమలదళంలో ఇద్దరు...
భాజపాలో కూడా కొందరు.. తమ బంధుగణానికి టికెట్లు ఇప్పించుకున్నారు.
తిలక్ నగర్ నుంచి పోటీ చేస్తున్న రాజీవ్ బబ్బర్.. గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓపీ బబ్బర్ కుమారుడే. ఈ స్థానం నుంచి 1993, 2003, 08లలో గెలిచారు ఓపీ. ఇదే చోట నుంచి 2013, 15లో బరిలోకి దిగిన రాజీవ్.. పరాజితుడిగా మిగిలారు.
దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ సోదరుడు ఆజాద్ సింగ్.. ముండ్కా నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. పశ్చిమ దిల్లీ భాజపా ఎంపీ పర్వేశ్ వర్మకు ఈయన మామ.
2013లో ఆజాద్ సింగ్ ఉత్తర దిల్లీ మేయర్‌గా ఎన్నికయ్యారు. 1998 నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ సంఘం (జీఎస్‌టీఏ) అధ్యక్ష పదవికి పోటీ చేశారు.
ఆప్ నుంచి..
ఆమ్ ఆద్మీ పార్టీ.. దిల్లీ మాజీ మంత్రి జితేందర్ సింగ్ తోమర్ భార్య ప్రీత్ తోమర్‌కు త్రి నగర్ టికెట్టు కేటాయించింది.
2015 అసెంబ్లీ ఎన్నికల్లో తన విద్యార్హతలపై నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం అందించారనే ఆరోపణలతో.. దిల్లీ హైకోర్టు జితేందర్‌పై ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇటీవల నిషేధం విధించింది. జితేందర్ తప్పుకోగా.. చివరి నిమిషంలో అభ్యర్థిత్వం ఆయన భార్య ప్రీతికి దక్కింది.