దిల్లీ వాయుకాలుష్యం రోజురోజుకూ మరింత తీవ్రతరమవుతోంది. గాలి నాణ్యత సూచీలు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీ కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో వివరణ ఇవ్వాలని పంజాబ్, హరియాణా, దిల్లీ, యూపీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది.
కాలుష్య నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని, వాయుకాలుష్యం తీవ్రంగా ఉన్న 13 ప్రాంతాల్లో కాలుష్య కారకాలను తొలిగించేందుకు కృషి చేయాలని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
మినహాయింపు ఎందుకు...?
దిల్లీ ప్రభుత్వం... సరి-బేసి విధానంలో భాగంగా ద్వి, త్రిచక్ర వాహనాలకు మినహాయింపు ఇవ్వడాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. సరి-బేసి విధానం అమల్లో ఉన్నప్పటికీ కాలుష్యం పెరుగుతూనే ఉందని ఆగ్రహించింది. వ్యవసాయ వ్యర్థాల కాల్చివేత తగ్గినప్పటికీ... కాలుష్య స్థాయిలు దారుణంగా ఉండటంపై అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది.
అయితే.. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనమే కాలుష్యానికి కారణమని.. సరి-బేసి విధానంతో కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టిందని న్యాయస్థానానికి తెలిపింది దిల్లీ ప్రభుత్వం.
పార్లమెంటరీ ప్యానెల్ సమావేశానికి డుమ్మా...
దిల్లీ వాయుకాలుష్యంపై చర్చించేందుకు ఉద్దేశించిన కీలక పార్లమెంటరీ ప్యానెల్ సమావేశానికి పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, దిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థ(డీడీఏ), మునిసిపల్ కమిషనర్లు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. దీనిపై పట్టణాభివృద్ధి శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొన్ని వారాలుగా దిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. వరుసగా నాలుగు రోజుల్లోనూ వాయునాణ్యత క్షీణించడం... విద్యాసంస్థల బంద్కు దారి తీసింది.
ఇదీ చూడండి: ఈ బార్లో బీర్ ఉండదు.. ఆక్సిజన్ మాత్రమే లభ్యం!