అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమాయిత్ ఉలామా ఐ హింద్ సంస్థలు నిర్ణయించాయి. తీర్పులో ఉన్న 5 ఎకరాల భూమి తీసుకోకూడదని నిశ్చయించుకుంది.
దశాబ్దాలుగా నలుగుతున్న అయోధ్య వివాదంపై ఈ నెల 9న సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. రామజన్మభూమిని హిందువులదే అని తేల్చిచెప్పింది. మసీదు స్థలానికి బదులు ముస్లింలకు 5 ఎకరాల భూమి కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నష్టాన్ని సరిచేయదు..
అయోధ్య విషయంలో సుప్రీంతీర్పుపై.. న్యాయవాదులు, నిపుణులు, ముస్లిం మతపెద్దలతో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ లఖ్‌నవూలో నేడు సమావేశం నిర్వహించింది. వివాదాస్పద భూమికి బదులుగా ఇస్తామన్న ఐదు ఎకరాల స్థలాన్ని తీసుకోకూడదని ఈ సమావేశంలో ఆ సంస్థ నిర్ణయించింది. సుప్రీం తీర్పులో అనేక వైరుధ్యాలు ఉన్నాయని.. అది ముస్లింలకు జరిగిన అన్యాయాన్ని సరిచేయదని అభిప్రాయపడింది.
"మసీదు ఉన్న భూమి అల్లాకు చెందినది. షరియా చట్టం ప్రకారం ఈ పవిత్ర భూమిని మరొకరికి ఇవ్వలేము. మసీదుకు ప్రత్యామ్నాయం ఉండరాదని బోర్డ్ అభిప్రాయపడింది."- జాఫర్యాబ్ జిలానీ, ఏఐఎమ్‌పీఎల్‌బీ కార్యదర్శి
రాజ్యాంగం ఇచ్చిన హక్కు
జమాయత్ ఉలామా అధినేత మౌలానా అర్షద్ మదాని కూడా అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే సమీక్ష పిటిషన్‌ను నూటికి నూరు శాతం సుప్రీంకోర్టు కొట్టేస్తుందన్న విషయం తమకు తెలుసని పేర్కొన్నారు. అయినా తీర్పుపై పిటిషన్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. సుప్రీంతీర్పును సవాల్ చేస్తూ సమీక్ష పిటిషనల్లు దాఖలు చేసే అవకాశం రాజ్యాంగం కల్పించిందని ఆయన పేర్కొన్నారు.
'తర్కం లేని తీర్పు..'
అయోధ్య వివాదం విషయంలో.. సాక్ష్యం, తర్కం లేకుండా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఉత్తరప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి, జమాత్ ఇ హింద్ సభ్యుడు ఎం. సిద్ధిఖ్ పేర్కొన్నారు. త్వరలోనే సుప్రీంతీర్పుపై రివ్యూ పిటిషన్లు వేస్తామని ఆయన స్పష్టం చేశారు.
తీర్పును స్వాగతిస్తున్నాం.. కానీ..
అయోధ్య భూ వివాదం కేసులో ప్రధాన కక్షిదారు ఇక్బాల్ అన్సారీ మాత్రం.. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలన్న ముస్లిం లా బోర్డ్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్‌బోర్డ్ స్వాగతించింది. అయితే వివాదాస్పద స్థలానికి ప్రత్యామ్నయంగా ఇస్తామన్న 5 ఎకరాల భూమిని తీసుకోవడానికి మాత్రం అంగీకరించలేదు.
మార్గదర్శిగా..
సమావేశంలో పాల్గొన్న ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ... ముస్లిం లా బోర్టు పిటిషనర్లకు మార్గదర్శిగా ఉంటుందన్నారు.
"ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు అయోధ్య కేసులో ఓ పార్టీగా ఉండదు. కేసు నిర్వహణలో ముస్లిం పిటిషనర్లకు మార్గదర్శిగా ఉంటుంది. ఇప్పటికే జమాయత్ ఉలామా ఐ హిందూ సహా 5 ముస్లిం సంస్థలు ఇందుకు ముందుకు వచ్చాయి." - అసదుద్దీన్ ఒవైసీ, ఏఐఎమ్ఐఎమ్ అధినేత
అయోధ్య కేసులో అసలు పిటిషనర్ ఎం సిద్ధిఖ్. అయితే ప్రస్తుతం యూపీ జమియత్ ప్రధాన కార్యదర్శి అషద్ రషీది ప్రధాన పిటిషనర్‌గా ఉన్నారని జమాయత్ కార్యదర్శి ఫజ్లూర్ రెహ్మాన్ తెలిపారు.
ఇదీ చూడండి: అబ్దుల్లా నిర్బంధంపై అఖిలపక్ష భేటీలో విపక్షాలు గరం