కేంద్ర ఆరోగ్య శాఖ తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) నర్సులు నిరవధిక సమ్మెకు దిగనున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 10 వేల మందికిపైగా సిబ్బంది.. నిరసనబాట పట్టనున్నారు. నర్సుల హామీలను నెరవేరుస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో మాటిచ్చినా.. ఇంతవరకూ వాటిని నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు నర్సు యూనియన్ అధ్యక్షుడు హరీశ్ కుమార్ కజ్లా.
"మా సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ హామీ ఇచ్చి ఏడాది కావస్తున్నా.. ఇంతవరకు ఎలాంటి స్పందనా లేదు. అందుకే మేం నిరవధిక సమ్మె చేపట్టబోతున్నాం. తొలుత దిల్లీ ఎయిమ్స్ నర్సులతో సమ్మె ప్రారంభమవుతుంది. అనంతరం.. దేశవ్యాప్త నర్సులంతా ఏకమై సమ్మెను ఉద్ధృతం చేయనున్నాం."
- హరీశ్ కుమార్ కజ్లా, ఎయిమ్స్ నర్సు యూనియన్ అధ్యక్షులు
పర్యావరణం, ఆరోగ్యం, భద్రత(ఈహెచ్ఎస్) సంస్కరణలు, 6 సెల్ ఇంక్రిమెంట్, ప్రత్యేక అలవెన్స్‌లు వంటి డిమాండ్ చేస్తున్నారు ఎయిమ్స్ నర్సులు.
కొవిడ్‌పై పోరాడుతున్నా.. కనికరం లేకుండా..
తమ డిమాండ్ల పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినా.. అవి ఇంకా కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు నర్సులు. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరిస్థితి మరింత దిగజారిందని వారు వాపోయారు. ఓవైపు తమ ప్రాణాలను పణంగా పెట్టి వైరస్ బాధితులకు సేవ చేస్తుంటే.. కేంద్రం మాత్రం తమపట్ల నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.
ఇదీ చదవండి: 'సెప్సిస్'ను ముందుగానే గుర్తించే టెక్నాలజీ!