మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై మరోమారు విమర్శలు గుప్పించింది తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకే. ప్రజల కోసం అవసరమైతే కలిసి నడుస్తామన్న ఇరువురు హీరోల ప్రకటనలపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది. 'వేర్వేరు సిద్ధాంతాలు కలిగిన కమల్, రజనీ కలవడం.. పిల్లి-ఎలుక ఒకే తాటిపైకి రావడంలా ఉంటుంది' అని అన్నాడీఎంకే సొంత పత్రిక 'నమదు అమ్మ' వ్యాసంలో పేర్కొంది.
" హేతువాదం, కమ్యూనిజం గురించి మాట్లాడే కమల్.. ఆధ్యాత్మిక రాజకీయాల గురించి ప్రస్తావించే రజనీ కలవడం.. పిల్లి-ఎలుక కలిసినట్లే ఉంటుంది. రాజకీయంగా కమల్‌తో స్నేహం ఫలించదని రజనీకి కాలమే చెబుతుంది. ఒకవేళ వారిద్దరూ కలిసినా 1.5 కోట్ల మంది కార్యకర్తలున్న అన్నాడీఎంకేకు ఎలాంటి నష్టం లేదు."
- 'నమదు అమ్మ' వ్యాసం
రజనీ వ్యాఖ్యలు సమంజసమే..
'పళనిస్వామి తమిళనాడు ముఖ్యమంత్రి కావడం ఓ ఆశ్చర్యం' అని సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను మక్కల్ నీది మయ్యమ్ వ్యవస్థాపకుడు, విశ్వనటుడు కమల్‌హాసన్ సమర్థించారు. రజనీకాంత్ వ్యాఖ్యలు 'విమర్శ కాదు, వాస్తవికత' అని కమల్ అభిప్రాయపడ్డారు.
ప్రజల కోసం కలిసి పనిచేస్తాం!
తమిళనాడు సంక్షేమం కోసం రజనీకాంత్‌తో చేతులు కలపడానికి తాను సిద్ధమేనని, అయితే రాజకీయంగా అది వీలవుతుందో లేదో చెప్పలేమని కమల్ అన్నారు. తాము సినీ పరిశ్రమలో మాత్రం 44 ఏళ్లుగా కలిసే ఉన్నామని కమల్ పేర్కొన్నారు.
కమల్ వ్యాఖ్యలపై కాసేపటికే స్పందించిన రజనీ... ప్రజల కోసం అవసరమైతే తామిద్దరం కచ్చితంగా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.