మిత్రపక్షం కాంగ్రెస్ నుంచి వచ్చిన విమర్శలతో.. గ్యాంగ్‌స్టర్ కరీం లాలాను మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కలిశారన్న వ్యాఖ్యలపై శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ వెనక్కు తగ్గారు. మొదట తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ సమర్థించుకునే ప్రయత్నం చేసిన ఆయన.. కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేయడం వల్ల వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
" నా వ్యాఖ్యలు.. ఇందిరాగాంధీ ప్రతిష్ఠను, కాంగ్రెస్ నేతల అభిమతాన్ని కించపర్చేలా ఉన్నట్లైతే.. వాటిని వెనక్కు తీసుకుంటున్నా."
- సంజయ్ రౌత్ , శివసేన అధికార ప్రతినిధి
బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సంజయ్ రౌత్... గతంలో ఇందిరాగాంధీ, గ్యాంగ్‌స్టర్ కరీం లాలాను దక్షిణ ముంబయిలో కలిశారని, పోలీసు కమిషనర్ ఎవరు ఉండాలో గ్యాంగ్‌స్టర్లే నిర్ణయించేవారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌తోపాటు భాజపా నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదీ చూడండి: భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు జైషే ఉగ్రవాదులు అరెస్ట్