ఉగ్రసంస్థలకు నిధులు నిలిపివేయాలని పాకిస్థాన్‌కు ఆర్థిక నేరాల నియంత్రణ సంస్థ(ఎఫ్ఏటీఎఫ్) హెచ్చరికల నేపథ్యంలో చైనా స్పందించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు కలిసి పోరాడాలని పిలుపిచ్చింది.
భారత్‌లోని చైనా రాయబారి సున్ వీయిడాంగ్తో ఓ వార్తాసంస్థ నిర్వహించిన ముఖాముఖిలో పలు విషయాలపై స్పందించారు.
"ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణచివేసేందుకు భారత్, చైనా కట్టుబడి ఉన్నాయి. ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి అన్ని దేశాలు సహకరించాలని చైనా అర్జిస్తోంది."
-సున్ వీయిడాంగ్, భారత్‌లో చైనా రాయబారి
ఈ ఏడాది మొదట్లో ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్ష బాధ్యతలను చైనా చేపట్టిన వేళ.. పాక్‌పై ఆంక్షలు తొలగుతాయని అంతా భావించారు. కానీ ఎఫ్ఏటీఎఫ్ సూచించిన ప్రమాణాలను పాటించటంలో పాక్ విఫలమయింది. ఈ మేరకు అక్టోబర్ 18న ఎఫ్ఏటీఎఫ్లో పాక్ స్థానంపై ఆ సంస్థ అధ్యక్షుడు జియాంగ్మిన్ లియూ ప్రకటన చేశారు.
"2020 ఫిబ్రవరి లోపు సూచించిన కార్యాచరణను పూర్తి చేయాల్సి ఉంది. మళ్లీ విఫలమయితే బ్లాక్ లిస్ట్‌లో చేర్చాల్సి వస్తుంది. పాక్ గడ్డపై ఉగ్రవాదులకు చోటు, ఆ సంస్థలకు నిధులను నిలిపివేయాలి."
-జియాంగ్మిన్ లియూ, ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్షుడు
భారత్ ఆరోపణలు..
సరిహద్దు ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తోందని అంతర్జాతీయ వేదికలపై భారత్ ఎన్నో సార్లు ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‌లో బాహాటంగా పనిచేస్తున్న నిషేధిత ఉగ్రసంస్థల వివరాలను బయటపెట్టింది. పుల్వామా, ఉరీ ఉగ్రదాడుల్లో పాక్ పాత్రను బహిర్గతం చేసింది. ఉగ్రవాదంపై పాక్ పోరును కంటితుడుపు చర్యగా భారత్ అభివర్ణించింది.
భారత్‌లో జిన్‌పింగ్ పర్యటనకు ముందు చైనాకు పాక్ ప్రధాని ఇమ్రాన్, సైన్యాధ్యక్షుడు ఖమర్ జావెద్ బజ్వా వెళ్లారు. ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్ లిస్టు ప్రమాదం నుంచి తప్పించాలని అర్థించారు. చైనా కూడా జిన్జియాంగ్ రాష్ట్రంలో ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోంది.