జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్‌లోని హవాల్ ప్రాంతంలో న్యాయవాది బాబర్ ఖాద్రీని పొట్టనబెట్టుకున్నారు. గుర్తుతెలియని ముష్కరులు.. కాల్పులు జరపగా ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే ఖాద్రీ ప్రాణాలు విడిచారు.
సాయంత్రం 6.25 గంటల ప్రాంతంలో ఉగ్రమూకలు న్యాయవాదిపై కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు.
ఫేస్బుక్లో తనపై వ్యతిరేక ప్రచారం నిర్వహించిన ఓ వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని 3 రోజుల క్రితం ట్వీట్ చేశారు ఖాద్రీ. ఈ ప్రకటనతో తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. అదే అతడి చివరి ట్వీట్.
న్యాయవాది ఖాద్రీ పలు టీవీ డిబేట్లలో కనిపించేవారు. స్థానిక వార్తాపత్రికలకు వ్యాసాలు రాస్తుంటారు. ఇది అక్కడి వేర్పాటువాదులకు నచ్చలేదని తెలుస్తోంది.
జమ్ముకశ్మీర్‌లో 24 గంటల్లోనే ఇది రెండో హత్య. బుడ్గాం జిల్లాలో ఖాగ్ బ్లాక్ డెవలప్మెంట్ కౌన్సిల్ సభ్యుడు భూపిందర్ సింగ్‌ను బుధవారం రాత్రి ఉగ్రవాదులు చంపారు.