ప్రేమ పేరుతో మత మార్పిడికి పాల్పడే ఘటనలను నివారించేందుకు పటిష్ఠ వ్యూహం రూపొందించాలని అధికారులను ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అవసరమైతే ఇందుకోసం ఆర్డినెన్సు రూపొందించాలని సూచించినట్లు వెల్లడించాయి.
"ప్రేమ, పెళ్లి పేరుతో ఇటీవల చాలా మంది మహిళలను మతం మార్చుకునేలా చేశారు. ఆ తర్వాత వారిపై నేరాలకు పాల్పడ్డారు. కొన్నిసార్లు హత్యలు కూడా చేశారు. వీటిని పరిగణలోకి తీసుకొని ఈ ఘటనలను నియంత్రించేలా పటిష్ఠ వ్యూహాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు."
-అధికారులు
మతమార్పిళ్లు వ్యవస్థీకృతంగా జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. దీన్ని అరికట్టేందుకు అవసరమైతే ఆర్డినెన్సు తీసుకురావచ్చని అన్నారు. ఇలాంటి నేరాలను పరిశీలించి, నిందితులపై సమర్థమైన చర్యలు తీసుకునేలా చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
లవ్ జిహాద్(ప్రేమ పేరిట మత మార్పిడికి పాల్పడటం)పై వస్తున్న ఫిర్యాదులను పరిశీలించడానికి ఇటీవలే కాన్పుర్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు.
కొత్త చట్టం అవసరం: లా కమిషన్
బలవంతపు మత మార్పిళ్లను అరికట్టేందుకు కొత్త చట్టం తెచ్చే అంశాన్ని పరిశీలించాలని ఉత్తర్‌ప్రదేశ్ లా కమిషన్ యోగి ప్రభుత్వానికి గతేడాది సిఫార్సు చేసింది. ఇందుకు సంబంధించి నివేదికతో పాటు చట్టం ముసాయిదా(ఉత్తర్‌ప్రదేశ్ మత స్వేచ్ఛ బిల్లు, 2019)నూ ప్రభుత్వానికి సమర్పించింది. దేశంలో స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత ఉన్న చట్టాలను పరిశీలించి ఈ ముసాయిదాను తయారు చేసింది. భారత్‌తో పాటు నేపాల్, మయన్మార్, భూటాన్, శ్రీలంక, పాకిస్థాన్ దేశాల్లోని శాసనాలతో పాటు కోర్టులు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులనూ పరిశీలించింది.
మత మార్పిళ్లను అరికట్టేందుకు ప్రస్తుతం ఉన్న నిబంధనలు సరిపోవని, ఇతర రాష్ట్రాల తరహాలోనే కొత్త చట్టం అవసరమని నివేదికలో స్పష్టం చేసింది లా కమిషన్. మధ్యప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, ఝార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బలవంతపు మతమార్పిళ్లు జరగకుండా ప్రత్యేక చట్టాలు ఉన్నాయని తెలిపింది.
ఇదీ చదవండి- వారెంటు లేకుండానే అరెస్టు చేసేయొచ్చు!