బాలీవుడ్ కథానాయకుడు సంజయ్ దత్ సోమవారం కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. నాగ్‌పుర్‌లోని మంత్రి నివాసానికి వెళ్లి సుమారు గంటపాటు చర్చించారు. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల వేళ ఇరువురి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతానికి వారి భేటీపై ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. సంజూభాయ్ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారనే వాదనలకు బలం చేకూర్చుతోంది.
ఇటీవలే రాష్ట్రీయ సమాజ్ పక్ష్ పార్టీ (ఆర్ఎస్పీ)లో సంజయ్ చేరనున్నారని ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మహారాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి మహదేవ్ జనకర్ వెల్లడించారు. కానీ ఆ వార్తలను ఖల్నాయక్ సున్నితంగా తిరస్కరించారు. తాను ఏపార్టీలో చేరబోనని స్పష్టం చేశారు.
2009లో సమాజ్‌వాదీ పార్టీ లఖ్‌నవూ ఎంపీ అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికల్లో నామపత్రాలు దాఖలు చేశారు సంజూ. తనపై ఉన్న అక్రమ ఆయుధాల కేసును కొట్టేయాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించిన కారణంగా నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అనంతర కాలంలో రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు సంజూ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరిగింది. ఆ ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.
ఇదీ చూడండి: 'భాష' కోసం యుద్ధానికి సిద్ధం: కమల్ హాసన్