అపార ప్రకృతి వనరుల ఆసరాతో భారత్ దేశీయంగా ఉత్పత్తి పెంపొందించుకుని, అంతర్జాతీయ మార్కెట్లకు అందించే స్థాయికి ఎదగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీ ఎర్రకోట వేదికగా జాతినుద్దేశించిన ప్రసంగించిన మోదీ.. భారతదేశం స్వావలంబనవైపు పరుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తుచేశారు. 'ఆత్మనిర్భర్ భారత్' ఇప్పుడు 130కోట్ల మంది భారతీయులకు ఓ మంత్రంగా మారిందన్నారు. ఇన్ని రోజులు ఓ కలగానే మిగిలిపోయిన ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ ప్రతిజ్ఞగా మారుతోందని తెలిపారు.
"తన కలను భారత్ సాకారం చేసుకుంటుందని నాను నమ్మకం ఉంది. భారతీయుల శక్తిసామర్థ్యాలపై నాకు ఎంతో విశ్వాసం ఉంది. ఏదైనా చేయాలని అనుకుంటే.. అది పూర్తయ్యే వరకు భారతీయులు విశ్రాంతి తీసుకోరు."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డు స్థాయిలో 18శాతం వృద్ధి చెందాయని తెలిపిన మోదీ... కరోనా సంక్షోభంలోనూ ప్రపంచ దేశాల్లోని పెద్ద కంపెనీలు భారత్వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో 'వోకల్ ఫర్ లోకల్'ను ప్రస్తావించారు మోదీ. తమ శక్తిని నమ్ముకుని ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మలుచుకోవాలన్నారు. ముడి సరుకును ఎగుమతి చేసి... పూర్తిగా తయారైన వస్తువులను దేశం దిగుమతి చేసుకునే దుస్థితి ఇంకెన్నాళ్లని ప్రశ్నించిన ప్రధాని.. ఆత్మనిర్భర భారత్ తక్షణావసరమని స్పష్టంచేశారు.
ఆత్మనిర్భర్ భారత్ సాధన విషయంలో లక్షలాది అనుమానాలు, సవాళ్లున్నాయని అంగీకరించారు ప్రధాని. అయితే వాటన్నింటినీ అధిగమించేందుకు కోటికిపైగా పరిష్కారాలను చూపగల శక్తి భారతీయులకు ఉందని ధీమా వ్యక్తం చేశారు.
కరోనా సంక్షోభ సమయానికి ముందు ఎన్-95మాస్కులను తయారీ చేసే స్థితిలో భారత్ లేదని.. కానీ ఇప్పుడు వాటిని ఎగుమతులు కూడా చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:-