కరోనా మహమ్మారి విజృంభణతో మూసివేసిన వస్త్ర దుకాణాలను ప్రభుత్వ అనుమతితో తిరిగి ప్రారంభిస్తున్నారు యజమానులు. ఈ తరుణంలో షాపుకు వచ్చే వినియోగదారులు మాస్కులు ధరించాలని లేకపోతే లోపలికి అనుమతి లేదని బోర్డులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే తమిళనాడు తిరుచిరపల్లికి చెందిన ఓ వస్త్ర దుకాణంలో మాత్రం వినియోగదారులు మాస్కులు ధరించారో లేదో అని పర్యవేక్షించటం కోసం ఓ రోబోను ఏర్పాటు చేశారు. దీనికి 'జఫిరా' అని నామకరణం చేశాడు ఆ షాపు యజమాని.
షాపుకు వచ్చే వారి శరీర ఉష్ణోగ్రతను జఫిరా చెప్తుందని, అలాగే శానిటైజర్‌ను కూడా అందజేస్తుందని ఆ యజమాని తెలిపారు. దుకాణంలోకి ప్రవేశించే వ్యక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు తెలియజేస్తుందని వెల్లడించారు. ఈ జఫిరాను తన అన్ని వస్త్ర దుకాణాల్లోనూ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.