దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. వైద్య పరీక్షలు నిర్వహించి మహమ్మారి సోకిన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇంకొందరిని హోం క్వారంటైన్లో ఉంచుతున్నారు. ఈ తరుణంలో ఆరోగ్య కేంద్రాల నుంచి బాధితులు పారిపోతున్నట్లు లేదా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తరచూ వార్తలు చూస్తూనే ఉన్నాం. అయితే.. కర్ణాటక ఉడుపి జిల్లాలో ఓ వ్యక్తి ఏకంగా 163 సార్లు క్వారంటైన్ నిబంధనలకు తూట్లు పొడిచాడు. అతడి తీరు పట్ల విసుగు చెందిన వైద్యాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
ఇదీ జరిగింది...
ముంబయిలో గ్లాస్, ప్లైవుడ్ మార్కెటింగ్ వ్యాపారం నిర్వహించే సాహెబ్ సింగ్ అనే వ్యక్తి.. గత నెలలో కర్ణాటకలోని కోటేశ్వర ప్రాంతానికి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న వైద్య శాఖ అధికారులు.. అతడిని జులై 13 వరకు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. కానీ ఆ సమయంలో సాహెబ్.. ఉడుపిలోని పలు హోటళ్లు సహా ఇతర ప్రాంతాల్లో ఇష్టారీతిగా తిరిగాడు. ఇలా మొత్తం 163 సార్లు ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అతని మొబైల్కు ఉన్న జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఈ సమాచారం సేకరించారు.
ఇదీ చూడండి:ముంబయిని కుదిపేస్తున్న భారీ వర్షాలు