కర్ణాటక చిక్మంగళూరు ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు. ఓ మహిళ కడుపులో నుంచి 18కిలోల భారీ కణతిని విజయవంతంగా తొలగించారు.
శివమొగ్గ జిల్లాకు చెందిన 45ఏళ్ల షఫురాభి కొద్ది కాలంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది. రోజురోజుకూ బరువు పెరుగుతూ వచ్చింది. పొట్ట భారీగా పెరిగిపోయింది. అయితే కొవ్వు కారణంగానే ఉదర భాగం పెరిగి ఉండొచ్చని ముందుగా అనుమానించింది షఫురాభి. కానీ ఆస్పత్రికి వెళ్లిన తర్వాత అసలు నిజం బయటపడింది. వైద్యులు స్కానింగ్ నిర్వహించగా.. కడుపులో భారీ కణతి ఉందని తేలింది.
వైద్యుల ఆశ్చర్యం
సర్జరీ కోసం చిక్మంగళూరు జిల్లాలోని కొప్ప ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు షఫురాభి. ఆస్పత్రికి చెందిన డాక్టర్ బాలకృష్ణ బృందం విజయవంతంగా కణతిని తొలగించింది. ప్రస్తుతం మహిళను పరిశీలనలో ఉంచారు వైద్యులు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
అయితే 18 కిలోల కణతిని చూసి ఆస్పత్రి వైద్యులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి భారీ స్థాయిలో కణతిని చూడటం ఇదే తొలిసారని చెబుతున్నారు.
ఇదీ చదవండి- లద్దాఖ్ పర్యటనలో సింధూ నదికి మోదీ ప్రత్యేక పూజలు