కర్ణాటకలోని బెంగళూరు మహానగరంలో వందలాది ఆసుపత్రులున్నా.. సమయానికి చికిత్స అందక కన్ను మూసింది ఓ బాలింత.
బెంగళూరుకు చెందిన నాగ భార్గవి ఆరు రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతుండగా.. కుటుంబ సభ్యులు ఆసుపత్రులకు తీసుకెళ్లారు. బీజీఎస్ కెంగేరీ, ఎమ్ ఎస్ రామయ్య, బౌరింగ్, పోర్టీస్, సప్తగిరి, విక్రమ్, నారాయణ హృదయాలయ వంటి 12 ఆసుపత్రుల తలుపు తట్టారు. కానీ, పడకల్లేవని ఒక్క యాజమాన్యం కూడా భార్గవిని చేర్చుకోలేదు.
ఊపిరాడక విలవిల్లాడుతున్న నాగ భార్గవిని చూసి... కుటుంబ సభ్యులు స్థానిక శాసన సభ్యురాలు సౌమ్యా రెడ్డి సాయం కోరారు. ఆమె స్పందించి ట్విట్టర్లో పడక కావాలని పోస్ట్ చేశారు. దీంతో నారాయణ ఆసుపత్రి ఆ బాలింతను చేర్చుకుంది. కానీ లాభం లేకపోయింది. సరైన సమయానికి చికిత్స అందకపోవడం వల్ల భార్గవి ప్రాణాలు విడిచిందని వైద్యులు వెల్లడించారు. ఫలితంగా ఆరు రోజుల ఆ నవజాత శిశువు ఇప్పుడు తల్లిలేనిదైపోయింది.
ఇదీ చదవండి: 'అమ్మ తాళి తాకట్టు పెట్టి, మా కోసం టీవీ కొనేసింది!'