జమ్ము కశ్మీర్ స్థానిక సంస్థల ఏడో విడత ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. జిల్లా అభివృద్ధి మండళ్ల(డీడీసీ)కు జరుగుతున్న ఈ దఫా ఎన్నికలో 298 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 31 డీడీసీ నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. దాదాపు ఆరు లక్షల మంది ఓటర్లు.. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
డీడీసీతో పాటు ఖాళీగా ఉన్న 69 సర్పంచ్, 438 పంచ్ స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించనున్నారు అధికారులు. మొత్తం 1,852 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. భద్రతపరమైన ఏర్పాట్లతో పాటు, కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది. థర్మల్ స్కానర్లు, మాస్కులు, శానిటైజర్లను పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది.