దేశ రాజధాని దిల్లీలో 73వ స్వాతంత్ర్య వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. తొలిసారి ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేయనున్నారు. త్రివర్ణ పతాక ఆవిష్కరణను చూసేందుకు వీక్షకుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు అధికారులు.
మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
ఎర్రకోట చుట్టూ మూడు రంగుల పరదా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రధాని మోదీతో పాటు ప్రముఖులు ఆశీనులయ్యేందుకు కోటపై వేదికను సిద్ధం చేశారు. బుల్లెట్ ఫ్రూఫ్ గ్యాలరీ నుంచి జెండా ఆవిష్కరణ చేసి అక్కడి నుంచే ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.
ఆర్టికల్ 370 రద్దు, ముమ్మారు తలాక్ వంటి కీలక బిల్లులను మోదీ సర్కారు ఆమోదించింది. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య సంబరాల వేడుకల్లో మోదీ ఏం చెప్పబోతున్నారన్న ఆసక్తి దేశమంతటా నెలకొంది. ఇప్పటికే జమ్ముకశ్మీర్ అంశంపై జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎలాంటి సందేశం ఇస్తారోనని అంతా ఎదురుచూస్తున్నారు
పటిష్ఠ భద్రత..
స్వాతంత్ర్య దినోత్సావాన్ని ప్రశాంతంగా జరిపేందుకు దిల్లీలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎర్రకోట ప్రాంతంలో నాలుగు వేల భద్రతా బలగాలను మోహరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన 1000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
దిల్లీ పోలీసులతో పాటు ఎస్పీజీ, ఎన్ఎస్జీ, పారా మిలటరీ బలగాలు ఆగస్టు 8 నుంచి నిరంతరం పహారా కాస్తున్నాయి. ఎర్రకోటకు చుట్టూ మూడు కిలోమీటర్ల మేర 144 సెక్షన్ విధించారు. భద్రత పరంగా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.