దేశంలో 71 శాతం మంది తల్లిదండ్రులు ఇప్పట్లో తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు సిద్ధంగా లేరని 'లోకల్ సర్కిల్స్ సర్వే' వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలను బడికి పంపాలనుకునే వారి శాతం నెల రోజుల్లో 23 నుంచి 20 శాతానికి పడిపోయినట్లు తెలిపింది.
దేశంలోని 217 జిల్లాల్లోని 14,500 మంది నుంచి లోకల్ సర్కిల్స్ అభిప్రాయాలను సేకరించింది. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలల పునఃప్రారంభానికి 28 శాతం మంది తల్లిదండ్రులే అనుకూలంగా ఉన్నారని తెలిపింది. డిసెంబర్ వరకు ప్రారంభించవద్దని 32 శాతం మంది, వచ్చే ఏడాది ప్రారంభించాలని 34 శాతం మంది కోరుకున్నట్లు నివేదించింది.
పొగమంచుతో..
ఉత్తర భారతంలో శీతకాలం భారీగా పొగమంచు ఆవరిస్తుంది. ఇది కరోనాతో కలిసి పరిస్థితిని మరింత దిగజార్చుతుందని చాలా మంది భావిస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కరోనా తగ్గుముఖం పడితే జనవరి నుంచి బడులను ప్రారంభించాలని ఎక్కువ మంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
పెరుగుతోన్న కేసులు..
దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన మార్చి నుంచి పాఠశాలలను మూసివేశారు. ప్రస్తుతం దేశంలో రోజూ 80 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 60 లక్షలు దాటింది. మరోవైపు రోజువారీగా కరోనా నిర్ధరణ పరీక్షల సగటు 11 లక్షల నుంచి 7 లక్షలకు పడిపోయింది.
ఇదీ చూడండి: యూపీఎస్సీ పరీక్షల వాయిదాకు సుప్రీం నిరాకరణ