అసోంలోని టిన్సుకియా జిల్లాలో ఆయిల్ ఇండియా లిమిటెడ్ చమురు బావిలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. మరో నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జ్వాలలను అదుపు చేసేందుకు అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, ఇంజినీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మంటల ధాటికి సమీపంలోని సుమారు 35 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోని సుమారు 7 వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఈ ఘటనలో ఆయిల్ ఇండియాకు చెందిన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు.
ప్రధాని భరోసా..
ఘటనపై సమాచారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బుధవారం ఫోన్ ద్వారా తెలియజేశారు అసోం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్. నష్టపోయిన ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధాని భరోసా ఇచ్చినట్లు పీఎంఓ వెల్లడించింది.
కమిటీ..
ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ముగ్గురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(జీడీహెచ్) డైరెక్టర్ జనరల్ ఎస్సీఎల్ దాస్ నేతృత్వంలో ఈ కమిటీ పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తుందని తెలిపింది. ఇందులో ఓఎన్జీసీ మాజీ ఛైర్మన్ బీసీ బోరా, మాజీ డైరెక్టర్ టీకే సేన్‌గుప్తా ఉన్నారు. నెల రోజుల లోపు నివేదిక సమర్పించనుంది కమిటీ.
ఉన్నతస్థాయి బృందాలు..
ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేసేందుకు కేంద్రం, అసోం ప్రభుత్వం గురువారం రెండు వేరువేరు ఉన్నతస్థాయి బృందాలను ఏర్పాటు చేసింది.
ఇదీ చూడండి: చమురుబావిలో మంటలు.. 13రోజులుగా విషవాయువు లీక్