లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన 3 నెలల్లోపు ప్రయాణాలు చేసేందుకు సుమారు 63 శాతం మంది సన్నద్ధమవుతున్నారని పేర్కొంది కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ). అయితే .. అందులో 70 శాతం మంది మాత్రం విదేశాలకు వెళ్లబోమని చెప్పినట్లు స్పష్టం చేసింది. ఆంక్షల సడలింపు తర్వాత ప్రయాణాలపై ఉత్తర భారత్‌లోని రాష్ట్రాల్లో సర్వే చేసి ఈ మేరకు వివరాలు వెల్లడించింది సీఐఐ.
కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆన్లైన్లో సర్వే నిర్వహించింది సీఐఐ. ఇందులో ఛండీగఢ్, దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, జమ్ముకశ్మీర్, లద్ధాఖ్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 250 మంది పాల్గొన్నారు.
"పర్యటక ప్రాంతంలో హోటళ్ల ఎంపికను పరిశుభ్రత ప్రమాణాలే నిర్ణయిస్తాయని 68 శాతం మంది తెలిపారు. ప్రయాణాల్లో ముందుజాగ్రత్త చర్యగా భద్రత ప్రమాణాలు పాటించటం ముఖ్యమని సుమారు 59 శాతం మంది వెల్లడించారు. ఆరోగ్య సేతు తప్పనిసరిగా ఉండాలని ఐదోవంతు మంది పేర్కొన్నారు. లాక్డౌన్ తర్వాత 3 నెలల్లో ప్రయాణాలు చేసేందుకు 63 శాతం మంది సుముఖంగా ఉన్నారు. పునరుత్తేజం పొందేందుకు ప్రయాణాలు ముఖ్యమైన సాధనమని 17 శాతం మంది వెల్లడించారు. లాక్డౌన్ సడలించిన నెలలోపే ప్రయాణాలు చేసేందుకు 33 శాతం, 3 నెలల తర్వాత చేస్తామని 30 శాతం మంది తెలిపారు. కానీ, 7 శాతం మంది ఏడాది పాటు ఎలాంటి ప్రయాణాలు చేయబోమని చెప్పారు.
70 శాతం కన్నా ఎక్కువ మంది దేశీయ ప్రయాణాలకు ఇష్టపడగా.. భారత్‌తో పాటు విదేశాల్లో ప్రయాణించేందుకు నాలుగొంతుల మంది సుముఖత తెలిపారు. 1.4 శాతం మంది విదేశీ ప్రయాణాలకే మొగ్గు చూపారు. వ్యాపార కార్యక్రమాల కోసం ప్రయాణం చేసేందుకు 37.4 శాతం, కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్లేందుకు 32 శాతం మంది ఇష్టపడ్డారు. అయితే.. కేవలం 2.4 శాతం మందే అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటామన్నారు."
- సీఐఐ
ప్రయాణాలు, పర్యటకం గురించి ఆలోచించే వారిపై కరోనా ప్రభావం అధికంగా ఉన్నట్లు సర్వే ఫలితాలు వెల్లడించాయి. కరోనాతో కలిసి జీవించటం నేర్చుకున్న తర్వాత కూడా పర్యటకాన్ని పునరుజ్జీవన సాధనంగా చూస్తారని తెలిపింది సర్వే. లాక్డౌన్ తర్వాత చాలా మంది విదేశీ ప్రయాణాలకు మొగ్గు చూపకపోవచ్చని పేర్కొంది. దాని ద్వారా దేశీయ విమానాశ్రాయాలు, నౌకాశ్రయాలు, విమానసంస్థలకు సవాళ్లు ఎక్కువవుతాయని పేర్కొంది.