రాజ్యసభకు కొత్తగా ఎంపికైన సభ్యులు ఈనెల 22న ప్రమాణస్వీకారం చేయనున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలనే నిబంధనలకు అనుగుణంగా హౌస్ ఛాంబర్‌లో కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం ఉంటుందని అధికారులు తెలిపారు.
సాధారణంగా సమావేశాలు జరుగుతున్నప్పుడో, సమావేశాలు లేనప్పుడు రాజ్యసభ చైర్మన్ ఛాంబర్‌లోనే కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం ఉంటుంది. అయితే.. గత పార్లమెంటు సమావేశాలు ముగిసి, తదుపరి సమావేశాలు ప్రారంభం కావడానికి మధ్యలో ఈ కార్యక్రమం జరగనుండటం ఇదే మొదటిసారి.
మొత్తం 20 రాష్ట్రాల నుంచి 61 మంది నూతనంగా పెద్దలసభకు ఎన్నికయ్యారు. జులై 22న నూతన సభ్యులందరికీ ప్రమాణం స్వీకార కార్యక్రమం ఉంటుందని రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ప్రమాణం చేసే ఎంపీతో పాటు.. మరొక అతిథికే అనుమతి ఉండనున్నట్లు నిబంధనల్లో పేర్కొన్నారు.
పార్లమెంటరీ కమిటీల కోసమే..!
కొత్తగా ఎన్నికైన సభ్యులతో పార్లమెంటరీ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ స్పీకర్ వెంకయ్యనాయుడు నిర్ణయించారు. కానీ కొత్తగా ఎన్నికైన వారిలో పార్లమెంటరీ కమిటీ అధ్యక్షులు కూడా ఉన్నారు. కాబట్టి వారు ప్రమాణ స్వీకారం లేదా ధ్రువీకరణ లేకుండా, సంబంధిత కమిటీల సమావేశాలను నిర్వహించలేమని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:'కరోనా నియంత్రణకు ప్రపంచ దేశాలతో కలిసి పోరు'