నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ ఒకటి. భద్రతా దళాలు- నక్సల్స్ మధ్య జరిగే పోరుతో అక్కడి ప్రజలు నిత్యం భయంతో జీవిస్తూ ఉంటారు. కానీ గత కొన్ని రోజులుగా అనూహ్య సంఘటనలు జరుగుతున్నాయి. పరస్పర విభేదాలతో నక్సలైట్ల సంస్థల్లో అంతర్యుద్ధం మొదలైంది. దీంతో ఒకరిపై ఒకరు దాడులు జరుపుకుంటున్నారు. ఫలితంగా గత 30రోజుల్లో ఆరుగురు మవోయిస్టులు మృతిచెందారు. వీరిలో రూ. లక్ష రివార్డు ఉన్న పోడియం విజ్జ అనే నక్సలైట్ కూడా ఒకరు.
అంతర్యుద్ధంతో పాటు ప్రజలపైనా విరుచుకుపడుతున్నారు మావోయిస్టులు. అమాయకులైన గ్రామస్థులు, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. గత 60రోజుల్లో 10మందికిపైగా ప్రజలను బలిగొన్నారు. వీరిలో ఓ సర్పంచ్, ఓ అటవీశాఖ అధికారి కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయం.
గవర్నర్ చర్యలు...
ఈ పరిణామాలపై ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ ఉయికే ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులను చక్కదిద్దాలని కోరుతూ రాష్ట్ర హోంమంత్రి తమ్రధ్వాజ్ సాహుకు లేఖ రాశారు.
నక్సలైట్ల ఉదంతంపై సమీక్షా సమావేశానికి పిలుపునిచ్చారు గవర్నర్. హోంశాఖ అధికారులు కూడా ఇందులో పాల్గొంటారని తెలుస్తోంది.
ఇదీ చూడండి:- కరోనా వేళ రాజకీయ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్!
మరోవైపు నక్సలైట్ల అంతర్యుద్ధంపై బస్తర్ ఐజీ పీ. సుందర రాజ్ స్పందించారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్టు వివరించారు. బస్తర్పై ఒకప్పుడు మావోల పట్టు ఎక్కువగా ఉండేదని.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయని చెప్పారు.
"గ్రామాలు, ప్రజల సంక్షేమంపై మాట్లాడే నక్సలైట్లు లొంగిపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. పరస్పర విభేదాల వల్ల సొంత కమాండర్లే తమను చంపేస్తారని వీరు భయపడుతున్నారు. నక్సలైట్లకు గ్రామ ప్రజలు కూడా సహకరించడం మానేశారు."
--- పీ. సుందర రాజ్, బస్తర్ ఐజీ.
బస్తర్ పోలీసుల ప్రకారం... ఈ ఏడాది జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 38 మంది అమాయక ప్రజలు నక్సలైట్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఎన్కౌంటర్లో 50మంది మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. 32మంది జవాన్లు అమరులయ్యారు. 40మంది మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. 100మందికిపైగా అరెస్టు అయ్యారు.
ఇదీ చూడండి:- టీఆర్పీ స్కామ్ బట్టబయలు- 3 ఛానళ్లపై కేసులు