అయోధ్యలో నగరంలో ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే దీపోత్సవం.. ఈ ఏడాది సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పనుంది. అందుకోసం మట్టి ప్రమిదలతో 5.5 లక్షల దీపాలు వెలిగించేందుకు ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. కరోనా మహమ్మారి కారణంగా ఎలాంటి ఆటంకం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రేక్షకులను ఈసారి దీపోత్సవాలకు అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో.. వర్చువల్గా పాల్గొనేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
అధికారిక సమాచారం ప్రకారం.. ఈ ఏడాది అయోధ్య దీపోత్సవం నవంబర్ 11-13 మధ్య జరగనుంది. 13న ప్రధాన దీపోత్సవం ఉంటుంది.
2017లో ఈ దీపోత్సవాన్ని ప్రారంభించింది ముఖ్యమంత్రి యోగి ప్రభుత్వం. రాష్ట్ర పండుగగా ప్రకటించింది. స్థానికులు, వలంటీర్లు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అయోధ్య నగరమంతా.. దీపాలు వెలిగిస్తారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 5 లక్షల దీపాలు వెలిగించారు.
" రామ్ కథా పార్క్, రామ్కీ పైదీ, నయాఘాట్, సరయు హారతి సహా పలు ప్రాంతాల్లో నవంబర్ 13న ప్రధాన దీపోత్సవం జరుగుతుంది. రామ్కథా పార్క్లో నిర్వహించే కార్యక్రమంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడికి పట్టాభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం సరయు హారతి, రామ్లీలా ప్రాంతాల్లో భజన కార్యక్రమం నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని ఈ కార్యక్రమానికి అనుమతించటం లేదు. కొద్ది మందికి మాత్రమే ధ్రువీకరణ పత్రాలు అందించాం. కరోనా నిబంధనలన్నింటినీ పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. "
- అనుజ్ కుమార్ ఝా, అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్
చారిత్రక 'రామ్లీలా' నాటకం అయోధ్య నగరంలో వర్చువల్గా ప్రదర్శితమవుతోంది. ఏటా దసరా పండుగ సందర్భంగా ఈ నాటక ప్రదర్శన చేపడతారు.
ఇదీ చూడండి: 10 కోట్లు దాటిన 'రామ్లీలా' వీక్షకుల సంఖ్య